Telugu Global
Telangana

466 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్

ఈ నెల నుంచి ఆశా వర్కర్లకు ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. హైదరాబాద్ పరిధిలోని ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు.

466 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
X

ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా.. అత్యవసర సేవలను మరింతగా పటిష్టపరచడానికి తెలంగాణ ప్రభుత్వం 466 అంబులెన్సులను కొనుగోలు చేసింది. ఈ వాహనాలను మంగళవారం పీపుల్స్ ప్లాజాలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. 466 అంబులెన్సుల్లో.. 108 సేవల కోసం 204, 102 (అమ్మ ఒడి) సేవల కోసం 228 వాహనాలు, మృతదేహాల తరలింపు కోసం 34 వాహనాలను సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన ఉండటంతో.. వాహనాలు ప్రారంభించి అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు మాట్లాడుతూ..

తెలంగాణ వైద్యారోగ్యం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ 75 వేల మందికి ఒక 108 వాహనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని హరీశ్ రావు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ 321 అత్యవసర సర్వీసులు 108 వాహనాలు ఉండగా. ఇవ్వాళ 466 అంబులెన్సులను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. 108 వాహనాలు రోజుకు 2వేల మందిని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. ఇక 102 వాహనాల ద్వారా రోజుకు 4వేల మంది గర్భిణులకు సేవ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ చెప్పారు.

కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతీ దశలో తెలంగాణ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, అమ్మఒడి వాహనలు, అంగన్ వాడీల్లో పిల్లలకు బలవర్ధక ఆహారం అందిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణలో వైద్య రంగం 5 అంచెల్లో పని చేస్తోంది. ఇవ్వాళ బస్తీ దవాఖాల నుంచి ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ వరకు మెరుగైన సేవలను అందిస్తోందని హరీశ్ రావు చెప్పారు.

గతంలో 108కి ఫోన్ చేస్తే యావరేజ్ అంబులెన్స్ టైం 15 నిమిషాలుగా ఉందని చెప్పారు. గతంలో ఇది 30 నిమిషాలుగా ఉండగా.. మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల క్విక్ రెస్పాన్స్ సాధ్యమైందని అన్నారు. ఇకపై 108 వాహనాలు స్టాటిక్‌గా ఉంచకుండా డైనమిక్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. 108 వాహనాల సిబ్బందికి నాలుగు స్లాబులుగా చేసి వేతనాలు పెంచామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఆశా వర్కర్లకు ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. హైదరాబాద్ పరిధిలోని ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


First Published:  1 Aug 2023 6:05 AM GMT
Next Story