Telugu Global
Telangana

అదొక్కటే గుర్తుంచుకోండి.. మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో కేసీఆర్

వర్థన్నపేటలో రింగ్‌ రోడ్ కోసం ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. అది అవాస్తవం అన్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా తాను హామీ ఇస్తున్నానని, ల్యాండ్ పూలింగ్ జరగదని చెప్పారు.

అదొక్కటే గుర్తుంచుకోండి.. మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో కేసీఆర్
X

అదొక్కటే గుర్తుంచుకోండి.. మహబూబాబాద్, వర్దన్నపేట సభల్లో కేసీఆర్

ఈరోజు మూడు ప్రాంతాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేటలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. అన్నిచోట్లా ఆయన ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేశారు. ఆలోచించి ఓటు వేయండి, ఆగమాగం కావొద్దని సూచించారు. ఎన్నికల ముందు గాలిగాలి కావొద్దన్నారు. ఎవరో చెప్పారని ఓటు వేయకుండా.. వాస్తవాలేంటో తెలుసుకుని ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు కేసీఆర్.


కాంగ్రెస్ కు అధికారం తప్ప అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు దుర్మార్గులు విజయం కోసం షార్ట్ కట్ పద్దతిని ఎంచుకుంటున్నారని వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. రైతుబంధు వృథా అని ఒకరు, 3 గంటలు విద్యుత్ చాలని ఇంకొకరు అంటున్నారని అసలు ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతుబంధు పదం పుట్టిందే కేసీఆర్ నుంచి అని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్.

20 ఏళ్ల కింద పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించామని.. అపుడు రాష్ట్రం సాకారమవుతుందని ఎవరికీ నమ్మకం లేదన్నారు కేసీఆర్. అవ‌మానాలు, అవ‌హేళ‌నలు భరించామన్నారు. "మ‌న‌తో పొత్తు పెట్టుకుని గెలిచి 14 ఏళ్లు ఏడిపించి, యువ‌కుల చావులు చూసి, నేను చావు నోట్లో త‌ల‌పెట్టి ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే, అప్పుదు దిగి వ‌చ్చి రాష్ట్రం ఇచ్చారు." అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, తెలంగాణ వచ్చాక ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దన్నారు కేసీఆర్.

వర్థన్నపేటలో రింగ్‌ రోడ్ కోసం ప్రభుత్వం ల్యాండ్‌ పూలింగ్‌ చేస్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. అది అవాస్తవం అన్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా తాను హామీ ఇస్తున్నానని, ల్యాండ్ పూలింగ్ జరగదని చెప్పారు. రూ.160 కోట్లతో వర్ధన్నపేటను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణలో పదేళ్ల క్రితం వ్యవసాయం ఎలా ఉండేదో? ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్.

First Published:  27 Oct 2023 3:09 PM GMT
Next Story