Telugu Global
Telangana

మునుగోడు నియోజకవర్గంలో ఓ గ్రామానికి ఇంచార్జిగా ఉండబోతున్న సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ శ్రేణుల్లో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3 పోలింగ్ జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ మొత్తం మునుగోడులోనే ఉండేలా ప్లాన్ చేశారు.

మునుగోడు నియోజకవర్గంలో ఓ గ్రామానికి ఇంచార్జిగా ఉండబోతున్న సీఎం కేసీఆర్
X

ఒకవైపు జాతీయ పార్టీ నిర్మాణానికి కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్..మునుగోడు ఉపఎన్నికపై కూడా పూర్తి దృష్టిపెట్టారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపునకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు. రేపటి నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా మునుగోడులోనే ఉండి ప్రచారాన్ని ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గం పరిధిలో 157 గ్రామాలు ఉన్నాయి. ప్రతీ గ్రామానికి ఒక ఇంచార్జిని నియమించడానికి ఇప్పటికే కేసీఆర్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు ఇప్పటికే ఓ మున్సిపాలిటి, ఓ గ్రామాన్ని అప్పగించారు. టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, అందరికీ తలా ఒక గ్రామం అప్పగించనున్నారు.

తాను కూడా ఓ గ్రామానికి ఇంచార్జిగా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల్లో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 3 పోలింగ్ జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ మొత్తం మునుగోడులోనే ఉండేలా ప్లాన్ చేశారు. అప్పటిలోగా మరో రెండు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. ముందుగా చండూరు మండలంలో ఒక సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని ఇప్పటికే మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.

జాతీయ పార్టీని ప్రకటించినా టీఆర్ఎస్ పేరు మీదే మునుగోడు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీని ప్రకటించిన ఈసీఐ వద్ద రిజిస్ట్రేషన్, పేరు మార్పునకు కొంత సమయం పడుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోపు ఈ పనులు పూర్తి కావు. అందుకే టీఆర్ఎస్ పేరు మీదనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో రెండు సార్లు సర్వే నిర్వహించారు. టీఆర్ఎస్‌కు కచ్చితంగా 40 వేల నుంచి 50 వేల మెజార్టీ వస్తుందని మంత్రి జగదీశ్ చెప్పారు. దసరా అనంతరం అందరం మునుగోడులో ఉండి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. టీఆర్ఎస్ తరపున ఓ ప్రతినిధి ప్రతీ ఓటర్‌ను కలిసేలా ప్లాన్ చేసినట్లు ఆయన చెప్పారు.

First Published:  5 Oct 2022 6:37 AM GMT
Next Story