Telugu Global
Telangana

టమాటా రైతు మహిపాల్ రెడ్డిని సన్మానించిన సీఎం కేసీఆర్

టమాటా పంటకు జూన్, జూలై నెలల్లో భారీగా డిమాండ్ ఉంటుందని ముందుగానే గ్రహించి తాను ఆ పంటను ఎంచుకున్నట్లు సీఎం కేసీఆర్‌కు మహిపాల్ రెడ్డి చెప్పారు.

టమాటా రైతు మహిపాల్ రెడ్డిని సన్మానించిన సీఎం కేసీఆర్
X

వాణిజ్య పంటల సాగు విషయంలో రైతులు వినూత్నంగా ఆలోచిస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టమాటా సాగులో రికార్డు సృష్టించిన మెదక్ జిల్లా రైతు మహిపాల్ రెడ్డి దంపతులను సీఎం కేసీఆర్ సోమవారం సెక్రటేరియట్‌లో సన్మానించారు. తెలంగాణ రైతులకు మహిపాల్ రెడ్డి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. సమయానుకూలంగా ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేయడం వల్ల రైతులు ఎంతో లాభం పొందుతారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

టమాటా పంటకు జూన్, జూలై నెలల్లో భారీగా డిమాండ్ ఉంటుందని ముందుగానే గ్రహించి తాను ఆ పంటను ఎంచుకున్నట్లు సీఎం కేసీఆర్‌కు మహిపాల్ రెడ్డి చెప్పారు. 20 ఎకరాల్లో టమాటాను వేశానని.. ఇప్పటికే రూ.2 కోట్ల విలువైన పంటను అమ్మానని తెలిపారు. పొలంలో ఇంకో రూ.1 కోటి విలువైన పంట ఉన్నట్లు మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. తమ పొలంలో పండిన టమాటాలతో చేసిన బొకేను సీఎం కేసీఆర్‌కు మహిపాల్ దంపతులు అందించారు.

కాగా, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి.. మహిపాల్ దంపతులను సెక్రటేరియట్‌కు తీసుకొని వచ్చారు. వారిద్దరినీ సీఎం కేసీఆర్‌కు పరిచయం చేశారు. వారిద్దరినీ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.


First Published:  25 July 2023 3:50 AM GMT
Next Story