Telugu Global
Telangana

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ మరింతగా పెంచారు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సబ్సిడీపై పరికరాలు ఇచ్చేవారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఉచితంగానే అందిస్తోందని చెప్పారు.

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ మరింతగా పెంచారు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచిన గొప్ప మనసున్న మహారాజు సీఎం కేసీఆర్. వారి బాధను అర్థం చేసుకొని పెన్షన్‌ను మరో రూ.1000 పెంచడం హర్షనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే నెల నుంచి దివ్యాంగులకు రూ.3,116 కాకుండా.. పెంచిన రూ.4,116 అందిస్తామని ఇటీవలే మంచిర్యాలలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి.. ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని మాట్లాడుతూ..

ఉమ్మడి ఏపీలో దివ్యాంగులకు కేవలం రూ.500 పెన్షన్ మాత్రమే ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని సీఎం కేసీఆర్ రూ.1,500 చేశారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3,116 చేసిన కేసీఆర్.. మరోసారి పెంచి ఇప్పుడు రూ.4,116 ఇవ్వబోతున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సబ్సిడీపై పరికరాలు ఇచ్చేవారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఉచితంగానే అందిస్తోందని చెప్పారు. అనంతరం దాదాపు 200 మంది దివ్యాంగులతో కలిసి మంత్రి అక్కడే భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవరెడ్డి, గజ్జెల నగేశ్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి తలసాని సాయికిరణ్, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు యాదగిరి, భాస్కర్, దివ్యాంగుల ఇండియా టీమ్ క్రికెట్ కెప్టెన్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


First Published:  12 Jun 2023 1:36 AM GMT
Next Story