Telugu Global
Telangana

అత్యంత అసమర్థ ప్రధాని మోదీ..

బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారని చెప్పారు కేసీఆర్.

అత్యంత అసమర్థ ప్రధాని మోదీ..
X

ఇప్పటి వరకూ భారత దేశాన్ని పరిపాలించిన ప్రధానుల్లో అత్యంత అసమర్థుడు నరేంద్రమోదీ అని ధ్వజమెత్తారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ప్రసంగించిన సీఎం కేసీఆర్, మోదీ పాలనను దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలన నుంచి 2014లో బీజేపీకి అధికారం అప్పగిస్తే ప్రజల పరిస్థితి పెనంపైనుంచి పొయ్యిలో పడినట్టుగా తయారైందని అన్నారు. 2014లో బీజేపీ, మోదీ గెలిచారని.. ప్రజలు ఓడిపోయారని అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండిచెయ్యి

కేంద్రం బడ్జెట్‌ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించాకు కేసీఆర్. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలకు అనుమతులిస్తే తెలంగాణకు ఒకటి కూడా రాలేదని.. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణకే కాదు, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అది క్షమించరాని నేరం అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం తెలంగాణకు నిధులు విడుదల చేయలేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తాగటానికి నీరులేదని, రత్నగర్భ లాంటి ఈ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నారు.

వెళ్లిపోతున్నారు..

బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారని చెప్పారు కేసీఆర్. సిటిజన్‌ షిప్‌ వదులుకునే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావటం లేదన్నారు. మన్మోహన్‌ సింగ్‌ మంచి వ్యక్తి అని, ఎక్కువ పని చేసి తక్కువ ప్రచారం చేసుకున్నారని, కానీ మోదీ తక్కువ పనిచేసి ఎక్కువ డప్పు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. మోదీ స్థానంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నా కూడా.. తెలంగాణ జీఎస్డీపీ రూ.16లక్షల కోట్లు ఉండేదన్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని చెప్పారు.

అదానీపై ఎందుకంత ప్రేమ..?

దివాళా తీస్తూ కూడా తామే గొప్పవాళ్లమని అనుకుంటున్నారని మోదీపై మడిపడ్డారు కేసీఆర్. అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం తప్పించేందుకు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతోందంటూ ప్రశ్నిస్తుంటే.. కనీసం కమిటీ వేసి విచారణ జరిపేందుకు కూడా కేంద్రం వెనకడుగు వేస్తోందన్నారు. అదానీ, తెలంగాణలోనూ పెట్టుబడులు పెడతామని వచ్చారని కానీ ఇక్కడ జాగా చూపించలేదని చెప్పారు. అదానీ సంస్థల్లో పలు బ్యాంకులతో పాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని నిలదీశారు.

బడే భాయ్.. చోటే భాయ్..

మీరేం చేశారో చెప్పండి అని అడిగితే, ఇప్పటికీ నెహ్రూ, ఇందిరా గాంధీల గురించే మోదీ మాట్లాడుతున్నారని, వాళ్లు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించారు కేసీఆర్. మధ్యలో రాహుల్‌ గాంధీ, మోదీ ఏం కూలగొట్టారనే విషయాలను బయటకు తెస్తారని.. వాళ్ల వ్యవహారం చూస్తుంటే ‘ఛోటే భాయ్‌ శుభానల్లా.. బడే భాయ్‌ మాషాల్లా’ అన్నట్టుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

First Published:  12 Feb 2023 11:24 AM GMT
Next Story