Telugu Global
Telangana

ఇందిరమ్మ రాజ్యమా.. తోకమట్ట రాజ్యమా- కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టేవారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం సుభిక్షంగా ఉండి ఉంటే రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇయ్యవలసి వచ్చిందన్నారు.

ఇందిరమ్మ రాజ్యమా.. తోకమట్ట రాజ్యమా- కేసీఆర్
X

ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యమా.. తోకమట్టనా అంటూ సెటైర్ వేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నవి ఆకలి చావులే కదా అని గుర్తుచేశారు. ఇందిరమ్మ రాజ్యమంతా నక్సలైట్ల ఉద్యమాలు, ప్రజలను కాల్చి చంపడం, ఎన్‌కౌంటర్లే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఎన్టీ రామరావు పార్టీ పెట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేంత వరకు చాలా మంది సగం కడుపుకే తినేవారని గుర్తు చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇందిరమ్మ రాజ్యమే బాగుంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టేవారని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం సుభిక్షంగా ఉండి ఉంటే రెండు రూపాయలకు కిలో బియ్యం ఎందుకు ఇయ్యవలసి వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం లాంటి దరిద్రమైన రాజ్యం ఇంకోటి లేదన్నారు కేసీఆర్. ఇందిరమ్మ పాలన అంతా రాచిరంపాలు పెట్టడం, దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

కొల్లాపూర్‌ చరిత్ర ఏం గొప్పగా లేదన్నారు. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లో గుంపు మేస్త్రీలు ఉండేవారని గుర్తుచేశారు. గుంపు మేస్త్రీల వెంట బొంబాయి వలసలు ఉండేవన్నారు. గంజి కేంద్రాలు పెట్టిన చరిత్రను మరిచిపోలేమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతంగా పేరు తెచ్చారన్నారు కేసీఆర్. పదేళ్ల కింద కూడా తెలంగాణకు నీళ్లు రావని, వడ్లు పండవని చెప్పేవారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. పక్కనే కృష్ణా నది ఉన్న మంచి నీళ్లు ఇవ్వలేదన్నారు కేసీఆర్. గతంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న వ్యక్తి కక్ష కట్టడం, కేసులు పెట్టడం తప్ప ఏమైనా చేశాడా అంటూ జూపల్లిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు కేసీఆర్. అందుకే ఆయనను ఓడించారని స్పష్టం చేశారు.

First Published:  19 Nov 2023 11:38 AM GMT
Next Story