Telugu Global
Telangana

నిధుల కొరతకు చెక్.. 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్!

ఆర్థిక శాఖ అనుమతి కోసం వేచి చూడకుండా.. నేరుగా ట్రెజరీలు, సబ్-ట్రెజరీలకు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు వెళ్లనున్నాయి. దీన్నే గ్రీన్ ఛానల్ అంటారు. దీని వల్ల సంబంధిత శాఖలకు నిధుల కొరత లేకుండా ఉంటుంది.

నిధుల కొరతకు చెక్.. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్!
X

తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల ఏడాది కావడంతో లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం జరుగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు 'గ్రీన్ ఛానల్' ద్వారా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను ఇప్పటికే అందిస్తోంది. అయితే సదరు పథకాల లబ్ధిదారులకు నిధుల పంపిణీ చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతోంది. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక.. సంబంధిత శాఖలు ఓకే చేస్తేనే లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయడానికి వీలుంటుంది.

అయితే, ప్రతీ మూడు నెలలకు ఒక సారి మాత్రమే ఆర్థిక శాఖ అవసరమైన నిధులకు సంబంధించిన క్లియరెన్స్ ఇస్తుంది. ఎన్నికల ఏడాది కావడంతో లబ్ధిదారులకు సరైన సమయానికి సంక్షేమ ఫలాలు అందకపోతే.. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే కోడ్ అమలులోకి వస్తుంది. కాబట్టి.. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆర్థిక శాఖ అనుమతి కోసం ఎదురు చూడకుండా.. నేరుగా ట్రెజరీలు, సబ్-ట్రెజరీలకు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు వెళ్లనున్నాయి. దీన్నే గ్రీన్ ఛానల్ అంటారు. దీని వల్ల సంబంధిత శాఖలకు నిధుల కొరత లేకుండా ఉంటుంది.

సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం గ్రీన్ ఛానల్ ద్వారా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌కు సంబంధించి రూ.3,210 కోట్లు విడుదలయ్యాయి. 2023-24 ఏడాదికి సంబంధించిన ఈ రెండు పథకాలకు నిధులు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మిగిలిన పథకాలకు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ట్రెజరీలకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బడ్జెట్‌లో ఇప్పటికే కేటాయింపులు జరిగిన వాటికి ఇలా గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు పంపుతున్నారని.. దీని వల్ల లబ్ధిదారులు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు, రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్లు, రూ.1 కిలో బియ్యం వంటి పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ఈ పథకాలకు ఎలాంటి నిధుల కొరత ఉండకూడదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే గ్రీన్ ఛానల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇక దళిత బంధు పథకానికి సంబంధించి రెండో దశ లబ్ధిదారులకు కూడా త్వరలో నిధులు విడుదల కానున్నాయి. దీనికి బడ్జెట్‌లో గతంలోనే కేటాయింపులు జరిగాయి.

కోవిడ్-19 కారణంగా తెలంగాణ రాష్ట్రం దాదాపు రూ.1 లక్ష కోట్ల రెవెన్యూను కోల్పోయినట్లు అధికారులు అంచనా వేశారు. దాని ప్రభావం ఇంకా రాష్ట్ర ఖజానాపై ఉన్నది. అయితే దీని వల్ల సంక్షేమ పథకాలు ఆగకూడదని.. ముందు ప్రాధాన్యత వాటికే ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కోవిడ్ ప్రభావం ఉన్నా రైతు బంధు డబ్బులు ఆపకుండా వేస్తున్న సంగతిని అధికారులు గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నిధులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే సీఎం కేసీఆర్ గ్రీన్ ఛానల్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  20 April 2023 2:14 AM GMT
Next Story