Telugu Global
Telangana

అన్ని అమ్మేశారు.. మిగిలింది రైతుల భూములే.. తస్మాత్ జాగ్రత్త

పెద్దపెద్ద గద్దలకు రుణమాఫీ పేరుతో ప్రధాని మోడీ దోచిపెట్టిన సంపద 12 లక్షల కోట్లు అని కేసీఆర్ వివరించారు. అదే దేశ వ్యాప్తంగా రైతులు వాడుకునే విద్యుత్ విలువ కేవలం లక్షా 40వేల కోట్లు మాత్రమేనన్నారు. ఆ మాత్రం రైతులకు ఇచ్చేందుకు మోడీకి చేతులు రావడం లేదన్నారు.

అన్ని అమ్మేశారు.. మిగిలింది రైతుల భూములే.. తస్మాత్ జాగ్రత్త
X

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని, రైతుల భూములు లాగేసుకోవాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్.. 2024లో కేంద్రంలో వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు.. 28 రాష్ట్రాలనుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు తనను జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారన్నారు. తాను జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలుపెడుతున్నట్టు ప్రకటించారు.

ఏదో మాయతో మత్తులో పడితే నష్టపోతామన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రతి మోటార్‌కు మీటర్లు పెట్టాలని మోడీ అంటున్నారని, దాని వెనుక మతలబు ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, విమానాలు, రైళ్లు, బ్యాంకులు అన్ని అమ్మేశారని, ఇప్పుడు మిగిలింది రైతుల దగ్గర భూమి అని.. ఆ భూములను లాగేసుకునేందుకే ఎరువుల ధరలు, విద్యుత్‌ ధరలు, డీజిల్‌ ధరలు పెంచడం, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వంటి పనుల ద్వారా రైతులు వ్యవసాయం ఆపేసి భూములు అమ్ముకునే పరిస్థితిని సృష్టించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతులు నాశనం అయిపోతే ఆ భూములను తీసుకునేందుకు తన దోస్తులైన కార్పొరేట్ కంపెనీలను సిద్ధం చేస్తున్నారన్నారు. రైతులను వారి భూముల్లో కూలీలుగా మార్చే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ హెచ్చరించారు.

పెద్దపెద్ద గద్దలకు రుణమాఫీ పేరుతో ప్రధాని మోడీ దోచిపెట్టిన సంపద 12 లక్షల కోట్లు అని కేసీఆర్ వివరించారు. అదే దేశ వ్యాప్తంగా రైతులు వాడుకునే విద్యుత్ విలువ కేవలం లక్షా 40వేల కోట్లు మాత్రమేనన్నారు. ఆ మాత్రం రైతులకు ఇచ్చేందుకు మోడీకి చేతులు రావడం లేదన్నారు. 2024 ఎన్నికల తర్వాత దేశంలో బీజేపీయేతర ప్రభుత్వమే రాబోతోందని.. మన ప్రభుత్వమే రాబోతుందని.. అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

ఈ దేశం కోసం తెలంగాణ గడ్డ మీద నుంచి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రైతుల బోర్ల కాడ మీటర్లు పెట్టడం కాదు.. ఆ ఆలోచన చేస్తున్న వారికే మీటర్‌ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా భారత్‌లో 41 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువైనదన్నారు. మోడీ వచ్చిన తర్వాత ఒక్క పెద్ద సాగునీటి ప్రాజెక్టునైనా కట్టించారా అని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలను చీలుస్తూ, ప్రభుత్వాలను పడగొడుతూ అహంకారంతో మోడీ బలుపుతో, మధమెక్కి వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సాగునీరు పారే కాలువలతో పచ్చని తెలంగాణ కావాలా.. మత పిచ్చి మంటల్లో నెత్తురు పారాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దేశం ఒక్కసారి దెబ్బతింటే సరిచేయడం సులువైన పనికాదన్నారు.

First Published:  5 Sep 2022 12:49 PM GMT
Next Story