Telugu Global
Telangana

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
X

అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకాన్ని ఎగుర వేస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇప్పటికే బాక్సింగ్‌లో అనేక విజయాలను సొంతం చేసుకున్న జరీన్.. ఒలింపిక్ పతకం కూడా సాధించి తెలంగాణ సహా.. భారత ఘన కీర్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాలని సీఎం కోరారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన జరీన్.. రాబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను నిఖత్ జరీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందుకయ్యే ఖర్చులకు గాను రూ.2 కోట్లను కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

అంతకు ముందు సచివాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కలిసి నిఖత్ జరీన్‌ను అభినందించారు. ఇంకా ఎన్నో పతకాలు సాధించి ఇండియా, తెలంగాణ పేర్లను నిలబెట్టాలని వారు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్ 50 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌గా రెండో సారి నిలిచింది. తెలంగాణ ఘనకీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహం అందించారు. జూబ్లీహిల్స్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయించారు.


First Published:  19 May 2023 1:32 AM GMT
Next Story