Telugu Global
Telangana

కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయలు ప్రకటించిన సీఎం కేసీఆర్

కేసీఆర్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాచుపల్లి సమీపంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో దిగి బస్సులో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు.

కొండగట్టుకు మరో 500 కోట్ల రూపాయలు ప్రకటించిన సీఎం కేసీఆర్
X

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మరో 500 కోట్ల రూపాయలను ప్రకటించారు. ఈ రోజు ఆయన కొండగ‌ట్టు పర్యటన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. దీంతో కొండగ‌ట్టు అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సొమ్ము600 కోట్లకు చేరుకున్నది.

కాగా, కేసీఆర్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాచుపల్లి సమీపంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో దిగి బస్సులో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు.

Advertisement

ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేసీఆర్ కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న భేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్టలను పరిశీలించారు.

మంత్రులు ఎ ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, టీఎస్‌ ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, రాజ్యసభ ఎంపీ దివకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, బాల్క సుమన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత తదితరులు కేసీఆర్ తో పాటు ఉన్నారు.

అనంతరం ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే కొండగ‌ట్టు అభివృద్దికి మరో 500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి తరహాలోనే కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.

Next Story