Telugu Global
Telangana

చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఉంది -కేసీఆర్

ఈ అభివృద్ధి చూసి పొంగిపోవద్దని చెప్పారు. చేయాల్సింది ఇంకా ఉందన్నారు. ద‌ళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా ఉన్నతాదాయ వర్గాలుగా మార్చినప్పుడే అభివృద్ధికి అసలైన అర్థం చెప్పినట్టు అవుతుందన్నారు కేసీఆర్.

చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఉంది -కేసీఆర్
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఉంటే మరో 50ఏళ్లు గడిచినా ఇలాంటి అభివృద్ధి జరిగేది కాదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌-1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. నిర్మల్ లో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రజలకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి చేసి చూపించాం.. ఇంకా చేస్తాం..

మానవ అభివృద్ధి సూచి, తలసరి విద్యుత్ వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు సీఎం కేసీఆర్. త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌ను దాటేసి ముందుకెళ్లామన్నారు. స‌మష్టి కృషి వ‌ల్లే ఇది సాధ్య‌మైందని, అయితే ఇక్కడితో ఆగిపోకూడదని, ఈ అభివృద్ధి చూసి పొంగిపోవద్దని చెప్పారు. చేయాల్సింది ఇంకా ఉందన్నారు. ద‌ళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలను కూడా ఉన్నతాదాయ వర్గాలుగా మార్చినప్పుడే అభివృద్ధికి అసలైన అర్థం చెప్పినట్టు అవుతుందన్నారు కేసీఆర్.


ఆదిలాబాద్‌ జిల్లాలోనే 4మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఆసిఫాబాద్‌ లాంటి అటవీ ప్రాంతంలో కూడా మెడికల్‌ కాలేజీ వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోడు భూముల పంపిణీ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్లకు సూచిస్తున్నట్టు తెలిపారు కేసీఆర్. ఈ ఏడాది నుంచే పోడు భూముల రైతులకు ‘రైతు బంధు’ అమలు చేస్తామన్నారు.

తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతోంద‌ని, దానికి తెలంగాణ ప్రజలే కారణం అన్నారు. ద‌శాబ్ది వేడుకల తొలిరోజు గంటన్నర సేపు తాను ప్రసంగిస్తే.. అందులో ఇంకా 20నుంచి 30విషయాలు చెప్పలేదని తనకు కొంతమంది గుర్తు చేశారని, ఆ స్థాయిలో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు కేసీఆర్. తెలంగాణలో మాన‌వీయ కోణంలో అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామని తెలిపారు. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు మ‌న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని కోరుతున్నారని అన్నారు.

First Published:  4 Jun 2023 2:18 PM GMT
Next Story