Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. జానారెడ్డిని నిలదీసిన దళిత, బీసీ నేతలు

హైదరాబాద్‌లో ఈ నెల 8న జ‌రిగే ప్రియాంక గాంధీ సభకు సంబంధించి న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హస్‌లో జానారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, పున్న కైలాస్‌ నేత, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య, తండు సైదులు గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. జానారెడ్డిని నిలదీసిన దళిత, బీసీ నేతలు
X

రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా... కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. నల్లగొండలో ఇది మరోసారి బహిర్గతమైంది. బీసీలు, దళితులకు పార్టీలో ఎందుకు స్థానం కల్పించడం లేదని ఆ పార్టీకి చెందిన బీసీ, దళిత నేతలు సీనియర్ నాయకుడు జానారెడ్డిని నిలదీశారు. ఈ నెల 8న హైదరాబాద్‌లో జ‌రిగే ప్రియాంక గాంధీ సభకు సంబంధించి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హస్‌లో జానారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, పున్న కైలాస్‌ నేత, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య, తండు సైదులు గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. మీడియా సమావేశం ప్రారంభానికి ముందు ఈ నేతలంతా జానారెడ్డిని నిలదీశారు. పార్టీలో తమ స్థానం ఎక్కడ అని ప్రశ్నించారు.

గత నెల 28న నల్లగొండలో జరిగిన నిరుద్యోగ సభలో కోమటిరెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చదివారని, తమను అసలు పట్టించుకోలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దళితులు, బీసీలు అవసరం లేదా..? అని ప్రశ్నించారు. ఆ విషయం చెబితే తమ దారి తాము చూసుకుంటామని చెప్పారు. సీనియర్ నాయకులైన మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. దీనికి జానారెడ్డి సమాధానమిస్తూ... ఈ విషయాలు తన దృష్టికి రాలేదని... ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా చూస్తానని జానారెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో కూడా జర్నలిస్టులు అడగడంతో కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని జానారెడ్డి చెప్పారు.

First Published:  5 May 2023 6:40 AM GMT
Next Story