Telugu Global
Telangana

సంజయ్ పై ప్రశ్నలు సంధించిన యువకుడు...టీఆరెస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో మోడీ ఇచ్చిన ఉద్యోగ హామీలపై ఓ యువకుడు అడిగిన ప్రశ్న బీజేపీ, టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు కారణమయ్యింది. ఇరు వర్గాలు రాళ్ళతో, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.

సంజయ్ పై ప్రశ్నలు సంధించిన యువకుడు...టీఆరెస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ
X

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా దేవరుప్పులలో టీఆరెస్, బీజెపి కార్య‌కర్తలు ఘర్షణకు దిగారు.

పాదయాత్రలో భాగంగా దేవరుప్పుల చేరుకున్న సంజయ్ అక్కడ స‌భలో మాట్లాడుతూ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. అ‍ందరికీ ఉద్యోగాలిస్తానన్న కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు. దాంతో సభలో నుండి ఓ వ్యక్తి లేచి బీజేపీ ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన మోదీ ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలని బండి సంజయ్ ని నిలదీశారు. దాంతో ఆవేశపడ్డ బండి సంజయ్ ప్రశ్న అడిగిన వ్యక్తిపై విరుచుకపడ్డారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యలర్తలు ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి దిగారు. దాంతో ఆ వ్యక్తికి మద్దతుగా టీఆరెస్ కార్యకర్తలు వచ్చారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఇరువైపులా పలువురు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Advertisement

మరోవైపు బండి సంజయ్ మాట్లాడుతూ దీంట్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందన్నారు. అయినా దాడులకు తాను భయపడబోనని అన్నారు. తనకు పోలీసు సెక్యూరిటీ కూడా అవసరం లేదని కార్యకర్తలే తనను కాపాడుకుంటారని చెప్పారు.

కాగా ముందుగా తమపై బీజేపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీరెస్ కార్యకర్తలు ఆరోపించారు. సంజయ్ ని ప్రశ్న అడిగిన యువకుడిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా తాము రక్షించడానికి ప్రయత్నించామని వారు తెలిపారు. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడమేంటని, ప్రశ్నించడమే తప్పా అని వాళ్ళు ప్రశ్నించారు.

Next Story