Telugu Global
Telangana

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ.. పలువురు కార్యకర్తలకు గాయాలు

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ.. పలువురు కార్యకర్తలకు గాయాలు
X

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో రెండు పార్టీలకు చెందిన పలువురి కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలయ్యాయి. నామినేషన్ల సందర్భంగా ఒకేసారి రెండు పార్టీల అభ్యర్థులు ఎదురుపడటంతో ఈ ఘర్షణ జరిగింది. నామినేషన్లు వేయడానికి రేపు చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ భారీ సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి భారీ ర్యాలీల‌తో నామినేషన్ వేసేందుకు ఆర్డీవో కార్యాలయం వద్దకు వచ్చారు.

ఒకరి తర్వాత మరొకరు వెళ్లి నామినేషన్ వేయాలని పోలీసులు కోరగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇది తీవ్రరూపం దాల్చడంతో ఇరువర్గాలు రాళ్లదాడికి దిగాయి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకోవ‌డంతో పాటు పార్టీ జెండా కర్రలను విసురుకున్నారు. ఈ దాడిలో రెండు పార్టీలకు చెందిన 15 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయ. రాళ్లు తగిలి అక్కడ ఉన్న పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో రాళ్లు తగిలి పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలందరినీ అక్కడి నుంచి పంపి వేయడంతో ఆర్డీవో కార్యాలయం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.

First Published:  9 Nov 2023 10:03 AM GMT
Next Story