Telugu Global
Telangana

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక!

జూబ్లీహిల్స్ నుంచి దాదాపు ఆరుగురు కాంగ్రెస్ తరపున టికెట్లు ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమకు టికెట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా అభ్యర్థులను ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) ఆదివారం ఖరారు చేసింది. ఒక్కో స్థానానికి గరిష్టంగా నలుగురిని ఎంపిక చేసి.. స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. చాలా నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటాపోటీ నెలకొన్నది. అలాంటి వాటిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి దాదాపు ఆరుగురు కాంగ్రెస్ తరపున టికెట్లు ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమకు టికెట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారు.

2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పుడు తొలి సారి కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండు సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విష్ణు ఓడిపోయారు. అయితే మరోసారి తనకు జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించాలని విష్ణు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అధిష్టానానికి సన్నిహితుడిగా పేరున్న మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కూడా జూబ్లీహిల్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. గతంలో యూపీ నుంచి ఎంపీగా గెలిచిన అజార్.. తెలంగాణ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. కానీ ఈ సారి మాత్రం ఏకంగా అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

గాంధీల కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న అజారుద్దీన్‌కు దివంగత నేత పిజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇటీవల బాహాటంగానే ఇరువురు నేతలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. తనకు చెప్పకుండా జూబ్లీహిల్స్‌లో పర్యటించడంపై అజారుద్దీన్‌పై విష్ణు ఫైర్ అయ్యారు. ఇక వీరిద్దరితో పాటు ఆమీర్ జావీద్ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఏఐసీసీ సభ్యుడు, టీపీసీసీ రీసెర్చ్ సెల్ చైర్మన్‌గా ఉన్న జావీద్.. ఈ సారి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

వీరు ముగ్గురితో పాటు భవానీ శంకర్, ఉపేందర్ రెడ్డి, నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అజారుద్దీన్ అనూహ్యంగా చక్రం తిప్పారు. పీఈసీ కమిటీలో సభ్యుడైన అజారుద్దీన్.. ఆదివారమే భవానీ శంకర్, ఉపేందర్ రెడ్డిలను కలిశారు. వారిద్దరినీ ఒప్పించి.. తన వర్గంలో కలిపేసుకున్నారు. ఉపేందర్ రెడ్డి తనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా అజారుద్దీన్ ఆయనను కలిసి పోటీ నుంచి విరమించుకునేలా చేసినట్లు తెలుస్తున్నది.

అజారుద్దీన్ తనకు అడ్డంకిగా ఉన్న భవానీ శంకర్, ఉపేందర్ రెడ్డిలను బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు. ఇక నవీన్ యాదవ్ కూడా దాదాపు పోటీ నుంచి తప్పుకున్నట్లే అని తెలుస్తున్నది. అయితే టికెట్ కోసం ఇప్పటికీ అజారుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆమీర్ జావీద్ లైన్లో ఉన్నారు. నిన్న మీటింగ్‌లో కూడా జూబ్లీహిల్స్ విషయంలో బాగానే చర్చ జరిగినట్లు సమాచారం.

జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో‌ ముస్లిం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. వీరు ఎటువైపు ఉంటే ఆ అభ్యర్థి తప్పకుండా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తున్నది. అదే జరిగితే అజార్ లేదా జావీద్ నుంచి ఎవరో ఒకరు టికెట్ దక్కించుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే విష్ణు వ్యతిరేక వర్గం మొత్తం అజార్‌కు మద్దతు ఇస్తుండటం గమనార్హం.

మరోవైపు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కూడా రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. దాని ప్రకారం కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి బరిలోకి దిగడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా విజయారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఒక వేళ కుటుంబంలో ఒకరికే అనే విషయంలో కట్టుబడి ఉంటే.. విజయారెడ్డికే టికెట్ ఇచ్చి.. విష్ణువర్ధర్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులే నెలకొన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ కనుక ముస్లిం అభ్యర్థి వైపే మొగ్గు చూపితే.. అజారుద్దీన్ ముందు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే పీఈసీ సమావేశంలో అజారుద్దీన్, ఆమీర్ జావీద్, విష్ణువర్ధన్ రెడ్డిలను ప్రాథమికంగా ఖరారు చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించారు. ఈ మూడు రోజుల సంప్రదింపుల తర్వాత ఎవరు చివరకు ఖరారు అవుతారో వేచి చూడాలి.

First Published:  4 Sep 2023 3:11 AM GMT
Next Story