Telugu Global
Telangana

భట్టికి చెక్‌.. ఫలించిన పొంగులేటి వ్యూహం

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి పేరు తీరమీదకు రావడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది.

భట్టికి చెక్‌.. ఫలించిన పొంగులేటి వ్యూహం
X

కాంగ్రెస్‌లో ఖమ్మం సీటు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సీటు కోసం హస్తం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఓ వైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఎంపీ టికెట్ కావాలని అడుగుతుండగా.. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌ రెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోమంత్రి తుమ్మల సైతం తన తనయుడు యుగేందర్‌కు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లుకూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాజకీయ భీష్ముడు, కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే ఈ రఘురామిరెడ్డి. సురేందర్‌రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వియ్యంకుడు.

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి పేరు తీరమీదకు రావడం వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి చెక్‌ పెట్టేందుకు సోదరుడు ప్రసాద్‌రెడ్డి పేరిట అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసిన పొంగులేటి.. బ్యాక్‌గ్రౌండ్‌లో తన వియ్యంకుడు, కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి తనయుడు రఘురామిరెడ్డి కోసం లాబీయింగ్ చేసినట్లు సమాచారం. వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం పార్లమెంట్ ‌స్థానాల్లో పొంగులేటి, రామసహాయం కుటుంబాల ప్రభావం బలంగా ఉంది.

రఘురామిరెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి దిగుతారని జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఎంపీ రేసులో ఈయన పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. సీఈసీ, స్క్రీనింగ్ కమిటీ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. ఇలా పార్లమెంట్‌ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భట్టి ఫ్యామిలీకి చెక్ పెట్టారు పొంగులేటి.

సోషల్ మీడియా వేదికగా పొంగులేటిపై భ‌ట్టి అనుచరులు మండిపడుతున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు. పార్టీని కబ్జా చేసేందుకు పొంగులేటి ప్రయత్నిస్తున్నారని.. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మల్లు నందిని అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినా.. టికెట్ ఖరారు కాలేదంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతుందో అర్థమవుతోందంటున్నారు. మల్లు నందినిని కాదని వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.

First Published:  31 March 2024 5:44 AM GMT
Next Story