Telugu Global
Telangana

ఆ ఊర్లో వినాయకుడిని నిమజ్జనం చేయరు.. 74 ఏళ్లుగా ఒకే విగ్రహం

నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాలజ్‌ అనే పల్లెటూరు ఉంది. ఇక్కడ ప్రతీ ఏటా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చాలా ఏండ్ల క్రితం కర్రతో చేసిన దాన్ని మాత్రమే ఇప్పటికీ విగ్రహంగా వాడుతుండటం గమనార్హం.

ఆ ఊర్లో వినాయకుడిని నిమజ్జనం చేయరు.. 74 ఏళ్లుగా ఒకే విగ్రహం
X

వినాయక నవరాత్రి ఉత్సవాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వీధివీధిన వినాయక విగ్రహాలను నెలకొల్పి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఎవరి తాహతుకు తగినట్లు వారు భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి.. 9వ రోజు నిమజ్జనం చేస్తారు. కొంతమంది 3, 5, 7వ రోజున నిమజ్జనం చేసినా.. ఎక్కువ మంది మాత్రం 9వ రోజునే వినాయకుడిని దగ్గరలోని చెరువులో లేదా నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేసి.. నవరాత్రులు ముగిస్తారు. మళ్లీ వచ్చే ఏడాది మరో కొత్త విగ్రహంతో నవరాత్రులు మొదలవుతాయి.

కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఊరిలో మాత్రం గత 74 ఏళ్లగా ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. అలా ఒకే విగ్రహంతో ఇన్నేళ్లూ పూజలు చేయడం వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది. నిర్మల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో గత 74 ఏళ్లుగా కర్రతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాలజ్‌ అనే పల్లెటూరు ఉంది. ఇక్కడ ప్రతీ ఏటా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చాలా ఏండ్ల క్రితం కర్రతో చేసిన దాన్ని మాత్రమే ఇప్పటికీ విగ్రహంగా వాడుతుండటం గమనార్హం.

మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న ఈ గ్రామంలో వినాయక చవితి రోజున కర్రతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అనంతరం 11 రోజుల పాటు పూజలు చేసి.. నిమజ్జనం చేయకుండా కేవలం వాగు నీటిని చల్లి పూజలు ముగిస్తారు. దాన్నే నిమజ్జనంగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. నీటిని చల్లిన అనంతరం ఆ కర్ర విగ్రహాన్ని గుడిలోనే భద్రపరిచి.. తిరిగి మరుసటి ఏడాది నవరాత్రుల సమయంలో పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇలా చేయడం వెనుక ఓ సంఘటన కారణమని స్థానికులు వివరిస్తున్నారు.

1948లో ఈ గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి దాదాపు 30 మందికి పైగా మరణించారు. అప్పుడే వినాయక చవితి వచ్చింది. ఊరంతా కలిసి ఒకే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్‌కు చెందిన నకాషి కళాకారుడు పోలకొండ గుండాజీతో ఓ కర్ర విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన తర్వాత ఊర్లో అంటువ్యాధులు తగ్గిపోయాయి. దీంతో ఆ విగ్రహానికి నిమజ్జనం చేయకుండా గుడిలో భద్రపరిచి.. ప్రతీ ఏటా దానికే ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ విగ్రహం వల్లే తమ గ్రామంలో మళ్లీ ఎలాంటి అంటు వ్యాధులు రాలేదని గ్రామస్తులు నమ్ముతారు. అందుకే ఆ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.

పాలజ్ గ్రామ ఆచారాన్ని తర్వాత కాలంలో చుట్టుపక్కల గ్రామాలు కూడా పాటించడం మొదలు పెట్టాయి. మట్టి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా చెక్కతో చేసిన విగ్రహాలను వాడుతున్నారు. పాలజ్ గ్రామంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని సత్య గణేషుడిగా పేర్కొంటారు. దీన్ని దర్శించుకోవడానికి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారని స్థానికులు చెప్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గ్రామంలో మద్యం, మాంసాలకు అందరూ దూరంగా ఉంటారని, కొంత మంది దీక్షలు కూడా చేస్తారని వివరించారు.

First Published:  5 Sep 2022 1:25 PM GMT
Next Story