Telugu Global
Telangana

తెలంగాణ ఎన్నికలపై చాణక్య స్టడీ రిపోర్ట్.. ఏ పార్టీకి ఎంత బలం ఉందంటే..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో 17.6 శాతం ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నట్లు చాణక్య సర్వే తేల్చింది.

తెలంగాణ ఎన్నికలపై చాణక్య స్టడీ రిపోర్ట్..  ఏ పార్టీకి ఎంత బలం ఉందంటే..
X

తెలంగాణ ఎన్నికలపై అందరికీ ఉత్కంఠ నెలకొన్నది. పలు సర్వే సంస్థలు రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం ఎవరిదో అంచనాలు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఎన్నికలపై చాణక్య స్టడీ రిపోర్ట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలకు ఎంతెంత ఓట్ షేర్ వస్తుందో అంచనా వేసింది. దాదాపు 14 లక్షల మందిని శాంపిల్‌గా తీసుకొని ఈ రిపోర్ట్ రూపొందించినట్లు మిషన్ చాణక్య చెప్పింది.

తెలంగాణలో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్‌ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల వైపు ప్రజలు ఆకర్షితులు అయ్యారని సర్వే చెప్పింది. ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు 44.62 శాతం మంది మొగ్గు చూపుతున్నారు.

ఇక తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 32.71 శాతం మంది మద్దతు ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో 17.6 శాతం ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నట్లు చాణక్య సర్వే తేల్చింది. కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఓటింగ్‌లో వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని కూడా చాణక్య సర్వే చెప్పింది.

ఇక తెలంగాణలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నారని తెలిపింది. సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే బ్రాహ్మణ, ఆర్య వైశ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తేల్చింది. ఆదివాసీ ప్రాంతాల్లోని గోండులు కూడా బీజేపీ వైపు ఉండటం గమనార్హం.

ఇక మైనార్టీలు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. మైనార్టీ ఓట్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దాదాపు సమానమైన ఓట్లు పడే అవకాశం ఉన్నది. కాకపోతే కాంగ్రెస్‌కు కాస్త మెజార్టీ ఉంటుందని సర్వేలో చెప్పింది. అనూహ్యంగా ముస్లింలలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే వాళ్లు పెరగ్గా.. క్రిస్టియన్లు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రైతులు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఉండగా.. ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సారి ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీగా జరగనున్నట్లు చాణక్య సర్వే తేల్చింది.

First Published:  22 Oct 2023 10:57 AM GMT
Next Story