Telugu Global
Telangana

'ఛాయ్ వాలా అప్డేటెడ్ వర్షన్ టాక్స్ వాలా' -హైదరాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీల యుద్దం

హైదరాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీ వార్ మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల నిత్యావసరాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి.

ఛాయ్ వాలా అప్డేటెడ్ వర్షన్ టాక్స్ వాలా  -హైదరాబాద్ లో మళ్ళీ ఫ్లెక్సీల యుద్దం
X

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగినప్పటి నుండి ఈ నగరంలో ఫ్లెక్సీల యుద్దం జోరందుకుంది. మోదీ తెలంగాణకు చేసిన అన్యాయాలు, తెలంగాణ ప్రభుత్వ సాధించిన విజయాలు, దేశాన్ని దిగజార్చిన మోదీ ప్రభుత్వపు విధానాల మీద ఫ్లెక్సీలు, పోస్టర్లతో అప్పుడు హైదరాబాద్ నిండి పోయింది. దీనికి పోటీగా మోడీ నిలువెత్తు ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. మళ్ళీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ వడ్డింపులు కొత్త ఫ్లెక్సీలకు, పోస్టర్లకు జీవం పోశాయి.

దేశవ్యాప్తంగా జీఎస్టీకి వ్యతిరేకంగా ప్రజలు అనేక రకాల రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. అటు వీధుల్లో ఇటు సోషల్ మీడియాలో మోదీ సర్కార్ పై యుద్దమే ప్రకటించారు. ముఖ్యంగా ప్రజల నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీఎస్టీ ఛాయ్ అని, జీఎస్టీ మిల్క్ అని పేర్లు పెట్టి కొందరు టీ స్టాల్ వ్యాపారులు టీలు అమ్ముతూ నిరసన తెలియ‌జేస్తూ ఉంటే హటాత్తుగా హైదరాబాద్ లో పలు చోట్ల కొన్ని ఫ్లెక్సీలు వెలిశాయి.

ఫ్లెక్సీపై ఒక పక్క మోదీ బొమ్మ , మరో పక్క పాల గ్లాసు దానిపై జీఎస్టీ అనే అక్షరాలు ఉండి 'ఛాయ్ వాలాస్ అప్డేటెడ్ వర్షన్ టాక్స్ వాలా' అని రాసున్న ఫ్లెక్సీలు పలు బస్టాప్ ల్లో వెలిశాయి. ఇవి ఎవరు ఏర్పాటు చేశారో వారి పేరు లేదు కానీ జీఎస్టీపై వాళ్ళకున్న కసంతా ఈ ఫ్లెక్సీల్లో కనిపించింది. దీన్ని ఫోటో తీసి వై. స‌తీష్ రెడ్డి అనే నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయ‌గా అది కామెంట్లు, రీ ట్వీట్లతో దూసుకపోతోంది. అక్షయ్ కేటీఆరేస్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ఫ్లెక్సీ వీడియో కూడా పోస్ట్ చేయబడింది.



First Published:  23 July 2022 12:14 PM GMT
Next Story