Telugu Global
Telangana

తప్పుడు గణాంకాలతో తెలంగాణను ఇబ్బంది పెడుతున్న కేంద్రం..

బకాయి ఉన్నారని చెప్పి విద్యుత్ కొనుగోళ్లకు అభ్యంతరం చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని తిప్పలపాలు చేసిన కేంద్రం, ఇప్పుడు నిస్సిగ్గుగా తన తప్పుని బయటపెట్టి కూడా క్షమాపణ అడగడంలేదు. తప్పైపోయిందని ఒప్పుకోవడంలేదు, కేవలం గణాంకాల్లో మిస్టేక్ వచ్చిందని కవర్ చేసుకోవడానికి సిద్ధమైంది.

తప్పుడు గణాంకాలతో తెలంగాణను ఇబ్బంది పెడుతున్న కేంద్రం..
X

గురువారం - తెలంగాణ డిస్కంలు జెన్‌కోలకు రూ.1360 కోట్లు బకాయి ఉన్నాయి.

శుక్రవారం - తెలంగాణ బకాయిలు రూ.52.85 కోట్లే..

24 గంటల వ్యవధిలో ఎంత తేడా.. అసలేంటి ఈ తప్పుడు లెక్కలు. తెలంగాణ బకాయిలు భారీగా ఉన్నాయని చెప్పి విద్యుత్ కొనుగోళ్లకు నిరాకరించిన కేంద్రం తప్పుడు లెక్కలతో గోల్ మాల్ చేసింది. తీరా బకాయిలు అంత లేవంటూ నాలుక కరచుకుంది. లెక్కల్లో ఈ తప్పులేంటని రాష్ట్ర డిస్కంలు ప్రశ్నిస్తే, చెల్లించేసిన సొమ్ములో తేడా వచ్చిందని, సరి చూసుకోవడంలో పొరపాటు జరిగిందని లైట్ తీసుకోమన్నట్టుగా చెబుతోంది కేంద్రం. ఎంత దారుణం. బకాయి ఉన్నారని చెప్పి విద్యుత్ కొనుగోళ్లకు అభ్యంతరం చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని తిప్పలపాలు చేసిన కేంద్రం, ఇప్పుడు నిస్సిగ్గుగా తన తప్పుని బయటపెట్టి కూడా క్షమాపణ అడగడంలేదు. తప్పైపోయిందని ఒప్పుకోవడంలేదు, కేవలం గణాంకాల్లో మిస్టేక్ వచ్చిందని కవర్ చేసుకోవడానికి సిద్ధమైంది.

జెన్‌కోలకు 13 రాష్ట్రాలు బకాయిలు ఉన్నాయని, ఆ బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ కొనుగోళ్లకు అనుమతిస్తామని పేర్కొన్న కేంద్రం తెలంగాణను కూడా బకాయి రాష్ట్రంగా పేర్కొంది. దీంతో శుక్రవారం తెలంగాణ డిస్కంలు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ ని కొనలేని పరిస్థితి. రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయే దుస్థితి. ఛత్తీస్‌ గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలు సమర్పించిన లెక్కలతో స్పష్టత రావడంతో కేంద్రం వాటిపై నిషేధాన్ని శుక్రవారం తొలగించింది. కానీ తెలంగాణ రూ.52.85 కోట్లు కట్టాలంటూ నిషేధాన్ని కొనసాగిస్తోంది.

ఒక విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి రాష్ట్రానికి చెందిన డిస్కం కరెంటు కొంటే 45 రోజుల్లోగా డబ్బు చెల్లించాలి. ఈ గడువు దాటితే లేట్ ఫీజ్ కింద జరిమానా విధిస్తారు. దీన్ని ఎల్పీసీ అంటారు. ఈ ఎల్పీసీ కింద రూ.52.85 కోట్లు తెలంగాణ డిస్కంలు కట్టాలని స్పష్టం చేసింది కేంద్రం. కానీ బకాయిల లెక్కలన్నీ సరిచూడాలని, అంత ఎల్పీసీ లేదని తెలంగాణ డిస్కంలు వాదిస్తున్నాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని డిస్కంలు ఆలోచిస్తున్నాయి.

జెన్ కో పై కేంద్రం పెత్తనమేంటి..?

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ప్రకారం కరెంటు అమ్మడం, కొనడం. జెన్‌కో - డిస్కం మధ్య జరిగే ప్రక్రియ. దీనిపై కేంద్రం జోక్యం అనవసరం. కానీ ఇందులో కేంద్రం వేలు పెడుతోంది. బకాయిలు కట్టకపోతే విద్యుత్ అమ్మకాలు చేయడం కుదరదని జెన్ కో లపై ఒత్తిడి తెస్తోంది. విద్యుత్తు సంస్థలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏంటని, ఈ నిర్ణయం దేశద్రోహ చర్యేనని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ ప్రేరేపిత చర్యలతో కేంద్రం రాష్ట్రాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటు పరం చేసి, పేదలకు రాయితీలను ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం ఇలా చేస్తోందన్నారు. విద్యుత్తు రంగం ఉమ్మడి జాబితాలోనిదని, నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెప్పారాయన. దీనిపై కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోదీ ప్రణాళికలు రచిస్తున్నారని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి.

శుక్రవారం తెలంగాణలోని జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి జరిగినందువల్ల సరఫరాలు కొరత రాలేదు. ప్రస్తుతం రూ.52.85 కోట్ల బకాయిలు చూపించి కేంద్రం కొర్రీలు పెడుతోంది. దీనిపై ఎలాంటి ముందడుగు పడుతుందో చూడాలి. గణాంకాల్లో తప్పులతో కేంద్రం తెలంగాణను ఇబ్బంది పెట్టాలని చూడటం ఇప్పుడు తేటతెల్లమైంది.

First Published:  20 Aug 2022 6:16 AM GMT
Next Story