Telugu Global
Telangana

కేంద్ర బలగాలు వర్సెస్ తెలంగాణ పోలీసులు.. రేవంత్ కొత్త లాజిక్

అమిత్‌ షా ఆదేశంతో భారీగా కేంద్ర బలగాలు మునుగోడుకి రాబోతున్నాయని, వచ్చీరాగానే వారు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి.

కేంద్ర బలగాలు వర్సెస్ తెలంగాణ పోలీసులు.. రేవంత్ కొత్త లాజిక్
X

మునుగోడు ఉప ఎన్నిక కోసం కేంద్రం ప్రత్యేక బలగాలను పంపించబోతోందని ఇది వారి కుటిల వ్యూహంలో భాగం అని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ప్రచార పర్వంలో బిజీగా ఉన్న ఆయన, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్‌ షా ఆదేశంతో భారీగా కేంద్ర బలగాలు మునుగోడుకి రాబోతున్నాయని, వచ్చీరాగానే వారు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తారని చెప్పారు రేవంత్ రెడ్డి. దానికి బదులుగా తెలంగాణ పోలీసులు బీజేపీ నాయకులపై దాడులకు దిగుతారని ఇదంతా వారి వ్యూహంలో భాగమేనని అన్నారు. ఈ దాడుల ద్వారా ఉద్రిక్తతలు సృష్టించి ప్రజలు ఆ రెండు పార్టీల మధ్యే ఉండేలా కుట్ర చేస్తారని చెప్పుకొచ్చారు.

బెంగాల్ వ్యూహం..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బెంగాల్‌ లో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య ఇదే రకమైన వ్యూహం అమలు చేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. అక్కడ వేరే పార్టీల ఊసు లేకుండా చేశారని, అదే ప్లాన్ మునుగోడు ఉపఎన్నికల్లో కూడా అమలు చేయాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలసి.. కాంగ్రెస్ ని తెలంగాణలో లేకుండా చేయాలనుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బ్యాలెట్ మార్చాలి..

బ్యాలెట్‌ రూపొందించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బ్యాలెట్ లో ముందుగా జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వాలని, కానీ టీఆర్ఎస్ కి రెండో స్థానం ఇచ్చారని, ఇది నిబంధనలకు విరుద్ధం అని అన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని, ఆ పార్టీ అభ్యర్థికి బ్యాలెట్ లో రెండో స్థానం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బ్యాలెట్‌ వరుస క్రమాన్ని వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు రేవంత్ రెడ్డి. కాంట్రాక్ట్ లకు అమ్ముడుపోయేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు.

First Published:  20 Oct 2022 1:50 AM GMT
Next Story