Telugu Global
Telangana

సికిందరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం నిరాకరణ‌...కిషన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు ?

ఇటీవల 10,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని నిర్ణయించిన రైల్వే స్టేషన్ల జాబితాలో సికిందరాబాద్ కు చోటు దక్కలేదు. రాష్ట్రప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం ససేమిరా అంది.

సికిందరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం నిరాకరణ‌...కిషన్ రెడ్డి ఏం చేస్తున్నట్టు ?
X

విభజన హామీల ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సి ఉండగా కేంద్ర బీజేపి సర్కార్ దాన్ని తిరస్కరించి మహారాష్ట్రలోని లాతూర్ లో ఏర్పాటు చేయబోతోంది. తెలంగాణ బుల్లెట్ రైలు కోసం విజ్ఞప్తి చేస్తే కేంద్రం అది గుజరాత్‌లోని గాంధీనగర్‌కు మంజూరు చేసింది. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష జాబితాలో ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరింది.

భారతదేశంలోని అతిపెద్ద, అతి ఎక్కువ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. 2018-19 సంవత్సరానికి గాను భారతీయ రైల్వేలో ఉత్తమ పర్యాటక, స్నేహపూర్వక రైల్వే స్టేషన్‌గా జాతీయ పర్యాటక అవార్డును కైవసం చేసుకుంది. అయినా ఇటీవల 10,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ది చేయాలని నిర్ణయించిన రైల్వే స్టేషన్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.

సికిందరాబాద్ స్టేషన్ కు భారీ ప్రాజెక్టులు ఇస్తామని గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు వాగ్దానం చేస్తున్నప్పటికీ కనీసం ఈ స్టేషన్‌లో ఎప్పుడూ కాంక్రీటు పనులు కూడా జరగ లేదు, కొంత కాలం క్రితం సికిందరాబాద్ స్టేషన్ ను రూ.653 కోట్లతో పునరాభివృద్ధి చేస్తామని కేంద్రం ఓ ప్రాజెక్టును ప్రకటించింది కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా తెలియదు. టెండర్లు పిలిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కానీ అవి ఎంత వరకు వచ్చాయో సమాచారం ఇచ్చే నాధుడే లేడు.

కేంద్రం ఈ మధ్య న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) యొక్క పునరాభివృద్ధి కోసం రూ. 10,000 కోట్ల ప్రాజెక్ట్ ను ప్రకటించింది. , అంటే ఒక్కో స్టేషన్‌కు రూ. 3,000 కోట్లకు పైగా లభిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఆ ప్రాజెక్టులో సికిందరాబాద్ కు కూడా స్థానం దక్కుతుందని ఎంతగానో ఆశించినప్పటికీ, రాష్ట్రం అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్రం మాత్రం నిర్ద్వందంగా తిరస్కరించింది.

సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన ఈ స్టేషన్ అభివృద్ది పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నప్పటికీ కిషన్ రెడ్డి మాత్రం నోరు తెరవడం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదంటూ నిరాధార ఆరోపణలు గుప్పిస్తునారు కిషన్ రెడ్డి.

సికింద్రాబాద్ స్టేషన్ NSG1 స్టేషన్‌గా (నాన్-సబర్బన్ గ్రేడ్ 1) వర్గీకరించబడింది, దీని రికార్డు ఆదాయం రూ. 500 కోట్లు. సంవత్సరానికి 2 కోట్లకు పైగా ప్రయాణీకులు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తారు. 2008లో అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కొన్ని ప్రధాన ప్రణాళికలను ప్రకటించారు. ఆ ప్రణాళికలు కాగితాలపైనే మిగిలిపోయాయి. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ఈ స్టేషన్‌కు కు సంబంధించి కనీస అవసరాలు కూడా పట్టించుకోలేదు.

సగటున, ప్రతి రోజు దాదాపు 230 రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చి వెళ్తుంటాయి. సగటున రోజుకు 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. టిఫిన్ సెంటర్ల నుండి భద్రత వరకు అనేక సౌకర్యాలుచాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్‌లలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఫస్ట్-క్లాస్ సౌకర్యాలు, సొగసైన రూపాన్ని,అనుభూతిని అందిస్తామని పేర్కొంది. అయితే ఆ అదృష్టం సికిందరాబాద్ స్టేషన్ కు పట్టలేదు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తో పాటు తెలంగాణలో రైల్వే సౌకర్యాల అభివృద్ధి విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న విషయం కోచ్‌ ఫ్యాక్టరీ ఎపిసోడ్‌తో స్పష్టంగా తేలిపోయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర‌ ప్రభుత్వం 150 ఎకరాల భూమిని కేటాయించింది. కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని కోరుతూ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు అనేక సార్లు లేఖలు రాశారు.

కానీ బిజెపి నేతృత్వంలోని కేంద్రం గొంతు మార్చింది. కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రలోని లాతూర్ కు తరలించింది. తెలంగాణకు బుల్లెట్ రైలు డిమాండ్ విషయంలో కూడా అదే కథ పునరావృతమైంది బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ లకు హ్యాండ్ ఇచ్చి గాంధీ నగర్ నుంచి ముంబై వరకు ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు

First Published:  8 Oct 2022 3:30 AM GMT
Next Story