Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్.. నోటీసులు జారీ

రాజగోపాల్ రెడ్డి అడ్డంగా బుక్కైనట్టే. 5.22 కోట్లకు సంబంధించి ఆయన లెక్కలు చెప్పే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈసీ ఆయనపై చర్యలు తీసుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్.. నోటీసులు జారీ
X

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. 5.22 కోట్ల రూపాయల లెక్కలు తేల్చాలని నోటీసులిచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వలేకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. దీంతో రాజగోపాల్ రెడ్డి కిందామీదా పడుతున్నారు. ఆ రూ.5.22కోట్లకు ఆయన లెక్కలు చెప్పే ఛాన్సే లేదు. ఫైనల్ గా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ లు తీసుకున్న రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఓటుకు నోటుపైనే ఆధారపడ్డారనేది బహిరంగ రహస్యం. అందుకే మునుగోడులో కోట్లు కుమ్మరిస్తున్నారు. వాహనాల్లో నగదు తరలిస్తే పోలీసులు సీజ్ చేస్తారనే భయంతో.. ఆన్‌లైన్ లావాదేవీలను ఉపయోగించుకున్నారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న 22 వ్యక్తిగత అకౌంట్లకు 5.22 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ అకౌంట్ నుంచి ఈ నగదు బదిలీ అయింది. దీనికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ సేకరించింది.

ఏయే బ్యాంకుల్లోని ఏయే అకౌంట్లకు ఎప్పుడు ఎంత నగదు బదిలీ అయిందనే విషయాన్ని లెక్కలతో సహా పక్కా ఆధారాలతో సేకరించి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. ఈ నగదు బదిలీని అడ్డుకోకపోతే ఎన్నికల్లో నోట్లతో ఓట్లుకొనే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యాన్ని రాజగోపాల్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నేతలు. వెంటనే ఆ 22 అకౌంట్లను ఫ్రీజ్ చేయాలని కోరారు. దీనిపై ఈసీ కూడా వేగంగానే స్పందించింది. ఆ 22 అకౌంట్లకు సంబంధించిన నగదు బదిలీలపై వెంటనే సమగ్ర సమాచారం తెలియజేయాలంటూ రాజగోపాల్ రెడ్డికి నోటీసులిచ్చింది.

వాస్తవానికి ఈ 22 అకౌంట్లతో సుశీ సంస్థకు అస్సలు సంబంధమే లేదు. వారి మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు కూడా జరగలేదు. సరిగ్గా మునుగోడు ఎన్నికల ముందే పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయి. దీంతో రాజగోపాల్ రెడ్డి అడ్డంగా బుక్కైనట్టే. రూ.5.22 కోట్లకు సంబంధించి ఆయన లెక్కలు చెప్పే పరిస్థితి లేదని అంటున్నారు. ఈసీ ఆయనపై చర్యలు తీసుకోవ‌డానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి నేరుగా ఈసీ షాకిచ్చింది. ఎన్నికలకు ముందే ఈ షాకులతో బీజేపీ ఓడిపోయింది, ఫలితాల తర్వాత ఆ లాంఛనం అధికారికంగా పూర్తవుతుంది.

First Published:  31 Oct 2022 1:28 AM GMT
Next Story