Telugu Global
Telangana

సీఈసీదే ఫైనల్ నిర్ణయం కాదా?

తెలంగాణలో ఇప్పటికే 55 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాంకు సంబంధించిన టికెట్ల కేటాయింపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన రెండో జాబితాపై చర్చోపచర్చలు చేస్తోంది. తెలంగాణ నాయకులు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్తోంది. అయిత కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం, సీఈసీ తీసుకునే నిర్ణయాలే అంతిమం కాదని తెలుస్తోంది.

తెలంగాణలో ఇప్పటికే 55 మందితో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. రెండో జాబితాను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే వీటిలో 10 నియోజకవర్గాల వరకు తీవ్రమైన పోటీ నెలకొన్నది. దీనిపైనే సీఈసీ తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఆయా స్థానాల్లో సీనియర్ నేతలు టికెట్ల కోసం పట్టుబడుతుండటం, సర్వేలు వారికి వ్యతిరేకంగా రావడంతో తుది నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాల్లో కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయలేకపోయారు.

ఇప్పటికే కొన్ని సీట్ల విషయంలో సీఈసీ నిర్ణయం తీసుకున్నా వాటిని ప్రకటించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ జాబితాను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకెళ్లారని.. అక్కడే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీలో మురళీధరన్, మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు అభ్యర్థులను ఖరారు చేసినా.. తుది నిర్ణయం మాత్రం రాహుల్ గాంధీ మీదనే వేసినట్లు తెలుస్తున్నది.

పార్టీ వ్యూహకర్త సునిల్ కనుగోలు నేరుగా రాహుల్‌తో టచ్‌లో ఉన్నారని.. తెలంగాణ విషయంలో తుది జాబితాను రాహుల్ వద్ద ఆయనే చర్చిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్ల విషయంలో ఎన్ని కమిటీలు వేసినా.. చివరకు గాంధీ ప్యామిలీనే నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తున్నది. కేవలం టికెట్లు మాత్రమే కాకుండా.. వామపక్షాల పొత్తులు, సీట్ల కేటాయింపు కూడా రాహుల్ నిర్ణయం మేరకే జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి తెలంగాణపై రాహుల్ గాంధీ పూర్తిగా దృష్టి పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  22 Oct 2023 4:35 AM GMT
Next Story