Telugu Global
Telangana

క‌వితను అరెస్టు చేసిన సీబీఐ

మార్చి 15న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు అదే రోజు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తరలించారు.

క‌వితను అరెస్టు చేసిన సీబీఐ
X

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంతో ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో కొద్ది రోజుల క్రితం కోర్టు అనుమతితో కవితను ప్రశ్నించిన సీబీఐ.. తాజాగా ఆమెను అరెస్టు చేసింది.

ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతితో ఈనెల 6న కవితను ప్రశ్నించింది సీబీఐ. ఐతే విచారణలో సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకపోవడంతో తాజాగా ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమెను 10 రోజుల పాటు సీబీఐ కస్టడీ కోరే అవకాశాలున్నాయి. మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ వేసిన కవితకు ఇప్పటికే ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్‌ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది.

మార్చి 15న హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు అదే రోజు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి తరలించారు.

లిక్కర్ స్కామ్‌ కేసులో తాను బాధితురాలినంటూ ఇటీవల ఓ లేఖను విడుదల చేశారు కవిత. లిక్కర్ పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు కవిత. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే.. మీడియా విచారణే ఈ కేసులో ఎక్కువగా జరిగిందన్నారు. దర్యాప్తు సంస్థలకు అన్ని రకాలుగా సహకరించానని.. తన బ్యాంకు అకౌంట్ల వివరాలు ఇచ్చానని లేఖలో స్పష్టం చేశారు కవిత.

First Published:  11 April 2024 10:52 AM GMT
Next Story