Telugu Global
Telangana

పిల్లి చోరీపై ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

అజహర్ మహమూద్ ఈ విషయమై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పిల్లి చోరీ అయ్యిందని .. దానిని వెతికి ప‌ట్టుకోవాల‌ని ఫిర్యాదు అందడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు.

పిల్లి చోరీపై ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

మామూలుగా బంగారం, డబ్బు చోరీ అయిందని.. విలువైన వస్తువులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటాం. పెంపుడు జంతువులైన బర్రెలు, గొర్రెలు, ఆవుల చోరీపై కూడా గ్రామాల్లో కేసులు నమోదు అవుతుంటాయి. అయితే తొలిసారి ఓ పిల్లి చోరీ అయిందని అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని వనస్థలిపురం జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి అరుదైన జాతికి చెందిన ఒక పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేసి దాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

18 నెలల వయసున్న ఆ పిల్లికి నోమనీ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. దాని కళ్ళల్లో ఒకటి గ్రీన్ కలర్ కాగా, మరొకటి బ్లూ కలర్. ఆదివారం రాత్రి ఆ పిల్లి చోరీకి గురైంది. దీంతో అజహర్ మహమూద్ ఈ విషయమై వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పిల్లి చోరీ అయ్యిందని .. దానిని వెతికి ప‌ట్టుకోవాల‌ని ఫిర్యాదు అందడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఇటువంటి ఫిర్యాదులు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదని చెప్పిన పోలీసులు.. దాని విలువ రూ. 50 వేలు కావడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జహంగీర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి పిల్లిని ఎత్తుకు వెళ్తుండడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. ప్రస్తుతం ఆ పిల్లిని ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లి చోరీకి గురైందని ఫిర్యాదు అందడం.. దానికోసం పోలీసులు సీరియస్ గా వెతుకుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

First Published:  10 Jan 2023 7:26 AM GMT
Next Story