Telugu Global
Telangana

నకిలీ రామచంద్రుడిపై మరో కేసు..

నకిలీ కార్డులు కలిగి ఉన్న కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రామచంద్ర భారతికి పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముంది. ఈ కేసులో కూడా పోలీసులు వీడియో ఆధారాలతోపాటు మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు.

నకిలీ రామచంద్రుడిపై మరో కేసు..
X

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఆ ముగ్గురిపై దర్యాప్తుకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశముంది. అదే సమయంలో ఆ ముగ్గురిలో ఒకరైన రామచంద్ర భారతిపై పక్కా ఆధారాలతో మరో కేసు కూడా ఫైల్ అయింది. ఇటీవల ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్.. నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లతో దళారీ బ్యాచ్ ఆగడాలను కళ్లకు కట్టారు. దానికి సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు. దీంతో నకిలీ కార్డుల వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ఇప్పుడు రామచంద్ర భారతిపై నకిలీ కార్డులు కలిగి ఉన్నారనే కేసు కూడా పెట్టారు పోలీసులు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు పెట్టినట్టు తెలుస్తోంది.

పదేళ్లు జైలు..

నకిలీ కార్డులు కలిగి ఉన్న కేసులో నేరం రుజువైతే గరిష్టంగా రామచంద్ర భారతికి పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముంది. ఈ కేసులో కూడా పోలీసులు వీడియో ఆధారాలతోపాటు మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తమ్మీద ఈ దళారీ బ్యాచ్ ని వదిలేది లేదని తేలిపోయింది. ఫామ్ హౌస్ కేసుతోపాటు.. విడివిడిగా ఆ ముగ్గురిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

బీజేపీకి షాక్..

ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నా, తెలంగాణ పోలీసుల విచారణకు హైకోర్టు అనుమతివ్వడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. దీంతో బీజేపీకి షాక్ తగిలింది. విచారణలో ఉన్న ఆ ముగ్గురు, ఇంకెవరి పేర్లయినా చెబుతారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ముఖ్యంగా నందకుమార్ తో సన్నిహిత సంబంధాలున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వారికి గుండె దడ మొదలైంది. పక్కా ఆధారాలతో ఆ ముగ్గురు పట్టుబడినా బీజేపీ తమకేం తెలియదంటూ బుకాయిస్తోంది. వారంతా ఆర్టిస్ట్ లు అంటూ కబుర్లు చెబుతోంది. బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నవారు కావడం, వారితో బీజేపీ నేతలు కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు ఈపాటికే సర్క్యులేట్ కావడంతో బీజేపీ నష్టనివారణ చర్యలు కూడా ఫలించడంలేదు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై ఫామ్ హౌస్ కేసు ప్రభావం కూడా గట్టిగానే ఉందని చెప్పొచ్చు.

First Published:  9 Nov 2022 1:55 AM GMT
Next Story