Telugu Global
Telangana

రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌.. కారుని కష్టపెడతాయా..?

పిటిషన్ విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. కారు గుర్తుకి ఓటు వేయాలనుకున్నవారు పొరపాటున చపాతి మేకర్ కి ఓటు వేస్తారని అనుకోలేమని చెప్పింది.

రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌.. కారుని కష్టపెడతాయా..?
X

రోడ్డు రోలర్, చపాతి మేకర్.. ఈవీఎంలలో ఈ గుర్తులు కొంచెం కారు గుర్తుని పోలి ఉంటాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ చాన్నాళ్లుగా అందోళన వెలిబుచ్చుతోంది. గతంలో ఓసారి వీటిని ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించారు. అయితే ఈ సారి ఎన్నికల సంఘం వీటి విషయంలో సమాధానం ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్, సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఆ రెండిటినీ ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని, స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తులను ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. బీఆర్ఎస్ పిటిషన్ ని తిరస్కరించింది.

పిటిషన్ విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. కారు, రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తుల మధ్య తేడాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు ఓటర్లు అని తేల్చి చెప్పింది. ఆ గుర్తులన్నీ ఒకే విధంగా ఉంటాయనేది అపోహ మాత్రమేనని, కారు గుర్తుకి ఓటువేయాలనుకున్నవారు పొరపాటున చపాతి మేకర్ కి ఓటు వేస్తారని అనుకోలేమని చెప్పింది. దీంతో ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో ఫ్రీ సింబల్స్ లో ఆ రెండు గుర్తులు ఉంటాయని తేలిపోయింది.

బీఆర్ఎస్ ఆందోళనకి కారణం ఏంటి..?

2018 ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు జరగడంతో బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో రోడ్డు రోలర్, చపాతి మేకర్ వంటి గుర్తులకు కూడా వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి. వాస్తవానికి ఆ గుర్తులను పొందిన స్వతంత్ర అభ్యర్థులకు అక్కడ ఆ స్థాయిలో ఓట్లు వస్తాయనే అంచనాలు లేవు, కనీసం ఆయా అభ్యర్థులకు కూడా అంత ధీమాలేదు. కొద్దోగొప్పో పేరున్న మిగతా అభ్యర్థుల కంటే ఆ రెండు గుర్తులు సాధించినవారు గణనీయంగా ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నారు. అంటే కారు గుర్తుకి పడాల్సిన ఓట్లు కొన్ని ఆ రెండు గుర్తులపై పడ్డాయనేది బీఆర్ఎస్ అనుమానం. కానీ ఇప్పుడు ఆ రెండు గుర్తులకు సుప్రీంకోర్టు కూడా అడ్డుపడకపోయే సరికి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్వతంత్రులకు ఆ రెండు గుర్తులు కేటాయించిన నియోజకవర్గాల్లో ఓటర్లను మరింతగా చైతన్యం చేయాలి. ఈవీఎంలలో గుర్తులు ఎలా కనిపిస్తాయో స్పష్టంగా వారికి చూపించగలగాలి. అప్పుడే వందల ఓట్లతో జాతకాలు తారుమారయ్యే పరిస్థితి నుంచి అభ్యర్థులు బయటపడగలరు.


First Published:  20 Oct 2023 9:15 AM GMT
Next Story