Telugu Global
Telangana

మా బాస్ మాటిస్తే తిరుగుండ‌దంటున్న‌ బీఆర్ఎస్ అభ్య‌ర్థులు..

ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకో అని ఆయ‌న ఓ మాటంటే చాలు ఇక టికెట్ వ‌చ్చేసిన‌ట్లేనంటున్నారు ఫ‌స్ట్ లిస్ట్‌లో టికెట్లు ద‌క్కించుకున్న నేత‌లు.

మా బాస్ మాటిస్తే తిరుగుండ‌దంటున్న‌ బీఆర్ఎస్ అభ్య‌ర్థులు..
X

గులాబీ బాస్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక‌సారి మాటిస్తే న్యాయం చేస్తారంటున్నారు బీఆర్ఎస్ నేత‌లు. తాజా జాబితాలో ఎమ్మెల్యే టికెట్‌ ద‌క్కించుకున్న ప‌లువురు నేత‌లు ఇదే మాటంటూ మురిసిపోతున్నారు. ఫ‌లానా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకో అని ఆయ‌న ఓ మాటంటే చాలు ఇక టికెట్ వ‌చ్చేసిన‌ట్లేనంటున్నారు ఫ‌స్ట్ లిస్ట్‌లో టికెట్లు ద‌క్కించుకున్న నేత‌లు.

వేముల‌వాడ‌లో చల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహరావు

వేముల‌వాడ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేశ్ జ‌ర్మ‌నీ పౌరుడ‌ని, ఆయ‌న ఇక్క‌డ పోటీ చేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని విప‌క్ష అభ్య‌ర్థి కోర్టుకెళ్లి కేసు గెలిచారు. ఈ కేసు న‌డుస్తుండ‌గానే ఇక అక్క‌డ ర‌మేశ్ వ‌ద్ద‌నుకున్న కేసీఆర్.. చల్మెడ ల‌క్ష్మీన‌ర‌సింహరావును ప‌ని చేసుకోమ‌ని చెప్పేశారు. చివ‌ర్‌లో ర‌మేష్ వ‌ర్గం నుంచి ఒత్తిడి వ‌చ్చినా చ‌ల్మెడ‌కే టికెట్ ఖ‌రారు చేశారు.

హుజూరాబాద్ నుంచి కౌశిక్‌రెడ్డి

మ‌రోవైపు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి వ‌చ్చి బీఆర్ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో కుల స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో టికెట్ ఇవ్వ‌లేదు. అసంతృప్తి చెంద‌కుండా కౌశిక్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్ హుజూరాబాద్ నీదే అని మాటిచ్చేశారు. ఇప్పుడు టికెట్ కేటాయించారు.

ఘ‌న్‌పూర్‌లో క‌డియంకు.. వైరాలో మ‌ద‌న్‌లాల్‌కు..

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో, వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న‌పెట్టి మరీ తాను ముందునుంచే సూచ‌న‌లిస్తున్న ఇద్ద‌రు నేత‌ల‌కు కేసీఆర్ టికెట్లిచ్చారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య‌మంత్రి రాజ‌య్య‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో అక్క‌డ సీనియ‌ర్ నేత క‌డియం శ్రీ‌హ‌రిని సిద్ధంగా ఉండ‌మ‌ని హింట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు టికెట్ క‌ట్ట‌బెట్టారు. అలాగే వైరాలో ఎమ్మెల్యే రాములు నాయ‌క్‌ను కాద‌ని మ‌ద‌న్‌లాల్‌కు అవ‌కాశం ఇచ్చారు. అక్క‌డా రాములుకే టికెట్ ఇవ్వాల‌ని కోరినా.. కేసీఆర్ త‌న ఆలోచ‌న ప్ర‌కార‌మే ముందుకెళ్లారు.

*

First Published:  22 Aug 2023 6:00 AM GMT
Next Story