Telugu Global
Telangana

క‌మ్మ‌గా తినండి.. మాకే ఓట్లేయండి .. హైద‌రాబాద్‌లో వ‌న‌భోజ‌న రాజ‌కీయాలు

కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి, ఎల్బీన‌గ‌ర్‌, ప‌టాన్‌చెరు త‌దిత‌ర న‌గ‌ర శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌న‌భోజ‌నాల సంస్కృతి ఉంది. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు వీటిని స్పాన్స‌ర్ చేసి ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

క‌మ్మ‌గా తినండి.. మాకే ఓట్లేయండి .. హైద‌రాబాద్‌లో వ‌న‌భోజ‌న రాజ‌కీయాలు
X

వ‌న‌భోజ‌నం.. కార్తీక మాసంలో అంద‌రూ క‌లిసి భోజ‌నం చేసే ఓ సంప్ర‌దాయం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఎక్కువ‌గా ఆచ‌రిస్తారు. ఒకే స్కూల్‌లో చ‌దువుకున్న‌వారు, ఒకే కాల‌నీలో ఉండేవారు, ఒకే కుల‌స్థులు, ఒకే చోట ప‌నిచేసేవారు ఇలా స‌మూహాలుగా పార్కులకో, ప‌ర్యాట‌క ప్రాంతాలకో వెళ్లి ఆట‌పాట‌లాడి.. విందు భోజ‌నాలు ఆర‌గించి వ‌స్తారు. ఆంధ్ర‌ప‌దేశ్‌లోని ఆయా ప్రాంతాల నుంచి వ‌చ్చి న‌గరంలో సెటిలైనవారు ఇప్ప‌టికీ ఈ సంప్ర‌దాయాన్ని పాటిస్తుంటారు. అందుకే ఆ వ‌న‌భోజ‌నాల ఖ‌ర్చేదో మ‌న‌మే పెట్టుకుందాం.. క‌మ్మ‌టి భోజ‌నం పెట్టి.. ఆ త‌ర్వాత మాకు ఓటేయండి అని అడిగేద్దాం అని అభ్య‌ర్థులు ప్లాన్ చేస్తున్నారు.

న‌గ‌ర శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఎక్కువ‌

సెటిల‌ర్లు పెద్ద సంఖ్య‌లో ఉన్న కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి, ఎల్బీన‌గ‌ర్‌, ప‌టాన్‌చెరు త‌దిత‌ర న‌గ‌ర శివారు నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌న‌భోజ‌నాల సంస్కృతి ఉంది. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు వీటిని స్పాన్స‌ర్ చేసి ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. మేడ్చల్ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి ఒకరు వనభోజనాల నిర్వహణకు ఇప్పటికే రెండు రిసార్టుల‌తోపాటు నాలుగు ఫాంహౌసులు బుక్ చేశారు. కూకట్‌ప‌ల్లిలో ఓ అభ్యర్థి రెండు ప్రధాన సామాజిక వర్గాలపై గురిపెట్టారు. పక్కనే ఉన్న శేరిలింగంపల్లి పరిధిలోని మూడు కన్వెన్షన్ కేంద్రాల్లో వ‌న‌భోజ‌నాల‌కు ఏర్పాట్లు చేయిస్తున్నారు.

కుత్బుల్లాపూర్‌లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ ఫంక్ష‌న్ హాళ్లు బుక్ చేయించారు. పటాన్‌చెరు బ‌రిలో ఉన్న ఓ అభ్య‌ర్థి సంగారెడ్డి ద‌గ్గ‌ర రెండు ఫంక్షన్‌హాళ్లు ఏకంగా 15 రోజులు అద్దెకు తీసేసుకున్నారు. ఒక్కోసామాజిక వ‌ర్గాన్ని ఒక్కోరోజు విందుకు పిలిచే ప్లాన్‌లో ఉన్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు బడా అభ్యర్థులు వ‌న‌భోజ‌నాల‌కు రండి అంటూ వివిధ సామాజిక‌వ‌ర్గాల వారితో భేటీ అవుతున్నారు.

పైస‌లు మ‌న‌వే.. ఖ‌ర్చు వాళ్ల ఎకౌంట్లో

ఎన్నిక‌ల ఖ‌ర్చును అధికారులు ప‌క్కాగా లెక్క‌లేస్తారు. అందుకే వ‌న‌భోజ‌నాల వంటి సామూహిక కార్య‌క్ర‌మాల‌కు తాము వెన‌కుండి స్పాన్స‌ర్ చేయిస్తే అవి ఆ సామాజిక‌వ‌ర్గ‌మో, కాల‌నీ లెక్క‌ల్లోనో ప‌డ‌తాయి.. ఒకేసారి వేల మంది ఓట‌ర్ల‌ను క‌లుసుకుని ఓట్ల‌డ‌గొచ్చు. ఓట‌ర్ల‌కు ముట్ట‌జెప్పాల‌నుకున్న‌వి కూడా వ‌న‌భోజ‌నాల్లో పోటీల‌ని, ల‌క్కీడిప్‌ల‌నీ అవ‌నీ ఇవ‌నీ పెట్టి జ‌నానికి అందించేందుకు కూడా కొంత‌మంది ప్లాన్ చేస్తున్నార‌ట‌!

First Published:  20 Nov 2023 9:12 AM GMT
Next Story