Telugu Global
Telangana

ఆ 60 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్‌.. ఈనెల 10న కాంగ్రెస్‌ ఫస్ట్ లిస్ట్‌ !

మహిళలకు కేటాయించే స్థానాలపైనా స్పష్టత కొరవడింది. దీంతో అభ్యర్థుల ఖరారుపై ఈనెల 8న ఢిల్లీలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది స్క్రీనింగ్ కమిటీ.

ఆ 60 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్‌.. ఈనెల 10న కాంగ్రెస్‌ ఫస్ట్ లిస్ట్‌ !
X

కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ఫైనల్‌ స్టేజ్‌కు చేరుకుంది. వచ్చే వారమే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు గత నెల 22, 23 తేదీల్లో మురళీధరన్‌ నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేసింది. దాదాపు 60 స్థానాలకు ఒక్కో పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. మరో 20 చోట్ల ఇద్దరేసి లీడర్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు స్క్రీనింగ్ కమిటీ గుర్తించింది. ఆయా స్థానాల్లో నాయకుల పనితీరు, సర్వేల ఆధారంగా టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో ముగ్గురు చొప్పున పేర్లు ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తమకు కనీసం 34 స్థానాలు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు ఒత్తిడి తేస్తుండగా.. గతంలో జరిగిన రెండు సమావేశాల్లోనూ స్క్రీనింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది.

ఇక మహిళలకు కేటాయించే స్థానాలపైనా స్పష్టత కొరవడింది. దీంతో అభ్యర్థుల ఖరారుపై ఈనెల 8న ఢిల్లీలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది స్క్రీనింగ్ కమిటీ. పార్టీలో కొత్తగా చేరేవారు ఎవరు..? ఏ నియోజకవర్గంలో ఎవర్ని బరిలో దించితే గట్టి పోటీ ఉంటుంది..? అనే అంశాలను పరిగణలోకి తీసుకుని.. మెజార్టీ నియోజకవర్గాలపై ఆ సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. గతంలో ఖరారు చేసిన కొన్ని పేర్లలోనూ మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం. వీలైనన్ని స్థానాలకు ఒక్కో పేరు ప్రతిపాదించి.. చిక్కుముడిగా ఉన్నచోట అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎన్నికల కమిటీకి అప్పగించే అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల 9న ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు, ప్రచార వ్యూహం, ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాల‌పై ఈ స‌మావేశంలో చర్చించే అవ‌కాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 10న కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశమై.. అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరేసి బలమైన అభ్యర్థులు పోటీపడుతుండటం, కొన్నిచోట్ల తాము సూచించినవారికి టికెట్‌ ఇవ్వాలంటూ ఇద్దరు, ముగ్గురు ముఖ్య నాయకులు పట్టుబడుతుండటంతో.. పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతృత్వంలో మరోసారి సర్వే నిర్వహించారు. ఈ సర్వేను పరిగణలోకి తీసుకుని ఫైనల్‌ లిస్టుకు ఆమోదం తెలిపే అవకాశముంది. అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తుండగా.. రెండు విడతలుగా ప్రకటించాలని రాష్ట్ర నేతలు కోరుతున్నట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.

First Published:  6 Oct 2023 3:18 AM GMT
Next Story