Telugu Global
Telangana

పోలీసుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు, ఆశావహులు.. కారణం ఏంటంటే?

అగ్రనేతల ప్రచారంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకున్నది. అదే సమయంలో అభ్యర్థులు, ఆశావహులు కాస్త టెన్షన్ పడుతున్నారు.

పోలీసుల చుట్టూ తిరుగుతున్న అభ్యర్థులు, ఆశావహులు.. కారణం ఏంటంటే?
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పెరిగిపోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి, బీఫామ్స్ ఇచ్చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. నేడో, రేపో మరో జాబితా కూడా విడుదల కానున్నది. బీజేపీ కూడా తమ అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఒకవైపు అభ్యర్థుల ఖరారు.. మరోవైపు అగ్రనేతల ప్రచారంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి ఊపందుకున్నది. అదే సమయంలో అభ్యర్థులు, ఆశావహులు కాస్త టెన్షన్ పడుతున్నారు.

ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే బీఫామ్‌తో పాటు అనేక పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు స్వయంగా ఒక అఫిడవిట్ కూడా వేయాలి. ఇందులో ముఖ్యమైనది అభ్యర్థుల నేర చిట్టా. నామినేషన్ వేసే ప్రతీ అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాలను తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఉండే నాయకులపై ఎన్నో కేసులు నమోదవుతుంటాయి. వీటిలో గుర్తుండే కేసులు కొన్ని.. గుర్తుండని కేసులు మరికొన్ని ఉంటాయి. కాబట్టి తమపై నమోదైన కేసుల వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు అభ్యర్థులు, ఆశావహులు అందరూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

తమపై నమోదైన కేసుల వివరాలను తెలియజేయాలని పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నాయకులు అయితే ఏకంగా డీజీపీ కార్యాలయానికే క్యూ కడుతున్నారు. అన్ని ప్రధాన పార్టీల కీలక నాయకులపై కేసులు ఉన్నాయి. ఏయే స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయో వీళ్లు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఏకంగా డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీ నాయకుల కేసుల వివరాలు ఇవ్వడానికి పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలో కేసులు ఎక్కడ నమోదు అయినా అది స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్సీఆర్బీ)లో నమోదు అవుతుంది. ఇది రాష్ట్ర సీఐడీ పరిధిలో ఉంటుంది. దీంతో చాలా మంది నాయకుల వ్యక్తిగత కార్యదర్శులు, అనుచరులు నేరుగా సీఐడీకే కేసుల వివరాల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు.. పూర్తయిన కేసులు.. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ పార్టీల నుంచి అధికారిక దరఖాస్తులు రావడంతో పోలీస్ శాఖ కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివరాలు అందిస్తోంది.


First Published:  21 Oct 2023 7:57 AM GMT
Next Story