Telugu Global
Telangana

జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స.. వైద్యారోగ్య శాఖ ప్రణాళిక

ఇకపై రాష్ట్రంలోని ప్రతీ జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి జిల్లా ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలు అందిస్తున్నారు.

జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స.. వైద్యారోగ్య శాఖ ప్రణాళిక
X

ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి అందరినీ భయపెడుతున్న. ఒకప్పుడు క్యాన్సర్ రోగులు అరుదుగా కనిపించే వారు. కానీ మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతరత్రా కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత క్యాన్సర్ చికిత్స అందిస్తోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఎంతో మంది రోగులకు ఉచితంగా చికిత్స చేస్తోంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది వ్యాధి ముదిరిన తర్వాత హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కానీ అప్పటికే క్యాన్సర్ శరీరమంతటా వ్యాపించి ఉంటుంది. ఇందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇకపై రాష్ట్రంలోని ప్రతీ జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి జిల్లా ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలు అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా పదేసి పడకలు ఏర్పాటు చేసి క్యాన్సర్ చికిత్స చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇక మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై పూర్తిగా అవగాహన ఉండటం లేదు. వ్యాధి ముదిరిన తర్వాత వాళ్లు చికిత్స కోసం ఆసుపత్రులకు వస్తున్నారు. ఇలాంటి వారికి సమీపంలోని జిల్లా కేంద్రాల్లో చికిత్సలు చేయాలని భావిస్తోంది. ప్రత్యేక మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి ప్రతీ గ్రామంలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల 10వేల మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేయగా.. దాదాపు 200 మందిలో వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి సమీపంలోని ఆసుపత్రుల్లోనే కీమో థెరపీ చేస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రతీ జిల్లా ఆసుపత్రిలో చేసే క్యాన్సర్ చికిత్సలను ఎంఎన్‌జే ఆసుపత్రి నిపుణులు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 నుంచి 150 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి కీమో థెరపీకి సంబంధించిన శిక్షణ ఇచ్చారు. వీరే జిల్లాల్లో ఆయా చికిత్సలు చేస్తున్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా వీడియో కాల్స్ ద్వారా నివృత్తి చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స సేవలు ప్రారంభమైతే.. హైదరాబాద్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందని వైద్యారోగ్య శాఖ భావిస్తోంది.

First Published:  27 Sep 2023 1:58 AM GMT
Next Story