Telugu Global
Telangana

రెండు టికెట్ల కాక.. రేవంత్‌రెడ్డి చ‌ల్లార్చ‌గ‌ల‌డా..?

రెండు టికెట్లు కోరుతున్న నాయ‌కుల జాబితా కాంగ్రెస్‌లో చాంతాడంత‌ ఉంది. ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్‌కు, ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి కోదాడ టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

రెండు టికెట్ల కాక.. రేవంత్‌రెడ్డి చ‌ల్లార్చ‌గ‌ల‌డా..?
X

ఈసారి ఎన్నిక‌ల్లో ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామ‌ని, రెండు టికెట్లు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ప‌ట్టే ప‌డుతోంది. మ‌రోవైపు ఇంటికి ఇద్ద‌రు అభ్య‌ర్థులున్న ప్ర‌తి నేతా త‌న‌కూ, త‌మ‌వారికి కూడా టికెట్లు ఇవ్వాలంటూ గాంధీభ‌వ‌న్‌లో అప్లికేష‌న్ పెట్టేశారు. దీనిపై రేవంత్‌రెడ్డే మాట్లాడాలంటూ త‌న‌కు, త‌న భార్య ప‌ద్మావ‌తికి క‌లిపి రెండు టికెట్లు అడుగుతున్న సీనియ‌ర్ నేత ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి నిన్న గాంధీభ‌వ‌న్‌లో జ‌రిగిన భేటీలో ప‌ట్టుబ‌ట్టారు. న‌న్నెవ‌రూ డిక్టేట్ చేయ‌లేరంటూ రేవంతూ గ‌ట్టిగానే కౌంట‌రిచ్చారు. ఈ రెండు టికెట్ల లొల్లి ఎంత‌వ‌రకూ వెళ్తుంద‌నేది ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర్గాల్లో కాక రేపుతోంది.

లిస్ట్ పెద్ద‌దే..

రెండు టికెట్లు కోరుతున్న నాయ‌కుల జాబితా కాంగ్రెస్‌లో చాంతాడంత‌ ఉంది. ఉత్త‌మ్ హుజూర్‌న‌గ‌ర్‌కు, ఆయ‌న భార్య ప‌ద్మావ‌తి కోదాడ టికెట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కోమ‌టిరెడ్డి సోద‌రులు వెంక‌ట‌రెడ్డి, రాజ‌గోపాల్‌రెడ్డి, మ‌ల్లు సోద‌రులు భ‌ట్టి విక్ర‌మార్క, ర‌వి, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, ఆయ‌న కుమారుడు అనిల్ యాద‌వ్ ఇలా ఇంటికి రెండు టికెట్లు అడుగుతున్న నేత‌ల జాబితా పెద్ద‌గానే క‌నిపిస్తోంది. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈసారి ములుగు ఎమ్మెల్యే సీత‌క్క త‌న‌కు ములుగు టికెట్‌తోపాటు త‌న కుమారుడికి పిన‌పాక సీటివ్వాల‌ని ద‌ర‌ఖాస్తు చేయించారు. సీనియ‌ర్ నేత దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ కూడా రెండు సీట్లు అడుగుతున్నారు. త‌న‌కు, త‌న భ‌ర్త కొండా ముర‌ళికి రెండు టికెట్లు కేటాయించాల‌ని వ‌రంగ‌ల్ జిల్లా నేత కొండా సురేఖ కోరుతున్నారు. జానారెడ్డి కుమారులిద్ద‌రూ నాగార్జునసాగ‌ర్‌, మిర్యాల‌గూడ టికెట్ల‌ కోసం క‌ర్చీఫ్ వేశారు.

రేవంత్ ప‌ట్టు ఎంత‌వ‌ర‌కు..?

ఇంటికి ఒకటే టికెట్ అన్న‌ది అధిష్టానం నిర్ణ‌య‌మ‌ని, అది త‌న‌కు శిరోధార్య‌మ‌ని రేవంత్ తెగేసి చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్‌లో కీల‌క‌నేత‌లంతా త‌మ‌కు రెండేసి టికెట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పైగా వీరంతా త‌మ‌తోపాటు త‌మ‌వారినీ గెలిపించుకోగ‌ల స‌మ‌ర్థులైన నేత‌లే. కాబ‌ట్టి స‌మ‌ర్థ‌త‌, ఆ నాయ‌కుల సామ‌ర్థ్యం ఆధారంగా అధిష్టానం ఈసారికి ఏమైనా మినహాయింపు ఇస్తుందా అనేది చూడాలి.

*

First Published:  30 Aug 2023 5:26 AM GMT
Next Story