Telugu Global
Telangana

'సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్'.. ఫైన్లు వెయ్యొద్దన్న హైకోర్టు

అడ్వొకేట్ ఆర్ఎన్. హేమేందర్‌నాథ్ రెడ్డి తాజాగా తన రెండు వాహనాలకు ఉన్న సింగిల్ డిజిట్ ప్లేట్లపై పోలీసులు చలాన్లు విధించారని, ఇది చట్టవిరుద్దమని హైకోర్టులో పిటిషన్ వేశారు.

సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్.. ఫైన్లు వెయ్యొద్దన్న హైకోర్టు
X

ఖరీదైన కార్లు, బైకులు కొనడమే కాదు.. వాటి కోసం ఎంతో ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబర్లు కూడా తీసుకుంటారు. కొంత మందికి సింగిల్ డిజిట్ నెంబర్లంటే ఎంతో వ్యామోహం. వేలంలో పాడుకొని మరీ 1 నుంచి 9 వరకు ఉండే సింగిల్ డిజిట్ నెంబర్లను తీసుకుంటుంటారు. ఇలాంటి వాహనదారుల కారణంగా తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు అదనపు రాబడి కూడా వస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సింగిల్ డిజిట్ నెంబర్ ప్లేట్లపై పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తం చెల్లించి సింగిల్ డిజిట్ నెంబర్లు తీసుకొని వాహనాలకు అమర్చుకుంటే.. వాటిపై చలాన్లు వేయడంపై హైకోర్టును ఆశ్రయించారు.

సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎన్. హేమేందర్‌నాథ్ రెడ్డి తాజాగా తన రెండు వాహనాలకు ఉన్న సింగిల్ డిజిట్ ప్లేట్లపై పోలీసులు చలాన్లు విధించారని, ఇది చట్టవిరుద్దమని హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. సింగిల్ డిజిట్ నెంబర్లను ప్రభుత్వమే జారీ చేసి, తిరిగి చలాన్లు విధించడంపై కోర్టు మండి పడింది. హేమేందర్‌నాథ్ రెడ్డికి చెందిన రెండు వాహనాలపై విధించిన చలాన్లను వెంటనే రద్దు చేయాలని, తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చలాన్లు విధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

అడ్వొకేట్‌కు చెందిన వాహనాలు నెంబర్లను ప్రదర్శించడంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనకు పాల్పడినా, ప్లేటు సైజు నిర్ణీత కొలతల ప్రకారం ఉన్నాయో లేదో కోర్టుకు తెలియజేయాలని.. దీనిపై డిసెంబర్ 6న విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు చలాన్లు విధించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. పిటిషన్‌లో పేర్కొన్న దానికి, పోలీసు చలాన్ల రికార్డులో ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉన్నదని తెలిపారు. ఆయనకు రవాణా శాఖ '0005' నెంబర్ కేటాయించగా.. ప్లేటుపై మాత్రం కేవలం '5' అని రాయించారని చెప్పారు. కాగా, తెలంగాణ రవాణా శాఖ అధికారులు మాత్రం నాలుగు డిజిట్లను నెంబర్ ప్లేట్లపై ప్రదర్శించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సింగిల్ డిజిట్ రవాణా శాఖ కేటాయించినా.. దానికి ముందు మూడు సున్నాలు చేర్చాలని.. ఇది మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం నిర్ణయించిందేనని తెలియజేశారు. దీనిలో ఏవైనా మార్పులు ఉంటే.. డిసెంబర్ 6న కోర్టుకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.

First Published:  22 Nov 2022 2:26 AM GMT
Next Story