Telugu Global
Telangana

కరీంనగర్‌లో రూ.224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం.

కరీంనగర్‌లో రూ.224 కోట్లతో కేబుల్ బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
X

స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న కరీంనగర్‌లో ఐకానికి కేబుల్ బ్రిడ్జి సిద్ధమైంది. మానేరు నదిపై విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూ.224 కోట్ల వ్యయం చేస్తూ నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించనున్నారు. అధునాతన రోడ్లు, నలువైపులా సెంట్రల్ లైటింగ్, ఇతర హంగులతో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దేశంలోని తొలి సారిగా డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఈ బ్రిడ్జిపై ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్ బ్రిడ్జి ఇదే కావడం గమనార్హం. కరీంనగర్ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్ ప్రధాన రహదారికి కలిసేలా మానేరు నదిపై దీన్ని నిర్మించారు. బ్రిడ్జిపై నాలుగు లేన్ల రోడ్‌తో 500 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జికి అవసరమైన కేబుల్స్ ఇటలీ నుంచి తీసుకొని వచ్చారు. ఇక బ్రిడ్జిపై పాదచారుల కోసం ఇరు వైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు.

ఈ కేబుల్ బ్రిడ్జిపై నుంచి చూస్తే ఒక వైపు మిడ్ మానేర్ రిజర్వాయర్‌తో పాటు.. మానేరు రివర్ ఫ్రంట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. మానేరు రివర్ ఫ్రంట్ కోసం ప్రభుత్వం రూ.410 కోట్ల ఖర్చు చేస్తోంది. ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని బుధవారం కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కేబుల్ బ్రిడ్జ్ విశేషాలను పేర్కొంటూ ట్వీట్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్, ఐకానికి మానేరు రివర్ ఫ్రంట్‌లతో కరీంనగర్‌కు కొత్త శోభ వచ్చింది. అందమైన ప్రకృతి దృశ్యానికి రివర్ ఫ్రంట్ ఒక ప్రతీకగా నిలవనున్నది. ఇందుకు కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

ఇక కరీంనగర్ పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధమయ్యారు. కరీంనగర్ నగరపాలక సంస్థ భవనాన్ని అధికారులు సుందరంగా తీర్చి దిద్దారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు ఇతర కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొంటారు.


First Published:  21 Jun 2023 2:30 AM GMT
Next Story