Telugu Global
Telangana

మునుగోడు మహిళలకు 'దీపావళి ఆఫర్'.. ఇంటికి 10 గ్రాముల గోల్డ్!

ఇంట్లో ఉన్న ఆరు ఓట్లు కూడా వేయిస్తే రూ. 52,500 విలువ చేసే 10 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తామని, ఆ మేరకు మాట ఇవ్వాలని చెబుతున్నాయి.

మునుగోడు మహిళలకు దీపావళి ఆఫర్.. ఇంటికి 10 గ్రాముల గోల్డ్!
X

మునుగోడు ఉపఎన్నిక అక్కడి ఓటర్ల పంట పండిస్తోంది. ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ కంకణం కట్టుకొని కూర్చున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తే ఇప్పుడు గెలిచే సీన్ లేదు. ఓటర్లకు భారీగా తాయిలాలు ఇస్తే తప్ప తమకు ఓటేయడని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే, ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మునుగోడులో మొత్తం పండగ వాతావరణమే. ఇంకా చెప్పాలంటే వినాయక చవితి నుంచి దీపావళి వరకు మునుగోడులో ప్రజలు సొంత డబ్బులతో కంటే పార్టీల విరాళాలతోనే పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓ జాతీయ పార్టీ నాయకులు కార్లు, బైకులు ఇస్తానంటూ భారీగానే ప్రచారం చేసుకున్నాడు. అంతే కాకుండా, స్వయంగా వాటిని బుక్ చేసి ఓట్లేయించే చోటా నాయకులకు అందిస్తున్నాడనే ప్రచారం జరిగింది.

తాజాగా మునుగోడులో మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. దసరాకు మొగోళ్లకు మందు, మటన్, క్యాష్ పంచిన పార్టీలే.. ఇప్పుడు దీపావళికి 'బంగారం' ఆఫర్ ఇచ్చాయి. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. అయితే దీపావళి ఈ నెల 25న రాబోతోంది. చాలా మంది ఆ రోజు బంగారం కొనడాన్ని సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. దీపావళి రోజు బంగారం ఇంటికి వస్తే అది శుభసూచకంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ప్రధాన పార్టీలకు చెందిన స్థానిక నేతలు ఇంటింటికీ తిరిగి మహిళా ఓటర్లను మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు.

ఏ కుటుంబంలో అయినా నాలుగు నుంచి 6 ఓట్లు ఉంటే.. ఆ ఇంటి ఇల్లాలుకి 10 గ్రాముల గోల్డ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఆరు ఓట్లు కూడా వేయిస్తే రూ. 52,500 విలువ చేసే 10 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తామని, ఆ మేరకు మాట ఇవ్వాలని చెబుతున్నాయి. ఓకే అన్న వారి పేర్లను లిస్టులో టిక్ పెట్టుకుంటున్నాయి. దీపావళి రోజు వీరందరికీ గోల్డ్ కాయిన్లు ఇంటికి చేరతాయని హామీ ఇస్తున్నారు. ఇక నాలుగు ఓట్ల కంటే తక్కువగా ఉండే ఇంటికి మాత్రం రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు క్యాష్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ దీపావళి గిఫ్ట్‌లని ఓటర్లకు చెబుతున్నాయి.

అన్ని పార్టీలో భారీగా తాయిలాలు ప్రకటిస్తుండటంతో ఏ 'ప్యాకేజీ' తీసుకోవాలో ఓటర్లకు అర్థం కావడం లేదు. కొంత మంది ఇద్దరు, ముగ్గురికి హామీలు ఇచ్చేస్తూ వచ్చిన కాడికి జేబులో వేసుకుంటున్నారు. ఈ విషయం స్థానిక కార్యకర్తలకు తెలిసినా.. ఏమీ చేయలేకపోతున్నారు. వేరే వాళ్ల దగ్గర తీసుకున్నా.. మనకే ఓటేస్తారులే అని వదిలేస్తున్నారు. గతంలో ఓటుకు రూ. 500 ఇచ్చిన వాళ్లను చూశాము. కానీ ఇంత భారీగా డబ్బును ఈ సారే చూస్తున్నామని ఓటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉపఎన్నిక పుణ్యమా అని పండగల ఖర్చంతా రాజకీయ పార్టీల మీదే వెళ్లిపోయిందని సంబరపడుతున్నారు.

మరోవైపు కేవలం ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాలకే కాకుండా.. 10 నుంచి 15 ఓట్లు వేయించగలిగే చోటా లీడర్ల పంట కూడా పండుతోంది. బైకులు, కార్లతో పాటు కొంత మంది హార్వెస్టర్లను కూడా డిమాండ్ చేస్తున్నారు. 20 ఓట్లు వేయించే సత్తా ఉంటే హార్వెస్టర్ తీసుకోమని ఓ పార్టీ ప్రతినిధి కూడా హామీ ఇచ్చారని.. కాంట్రాక్టుల ద్వారా వచ్చిన సొమ్మును ఇలా పంచేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఒక్క ఓటు కూడా మిస్ అవకుండా అన్ని పార్టీలో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందో ఏమో గానీ.. మునుగోడు ఓటర్లు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

First Published:  11 Oct 2022 8:29 AM GMT
Next Story