Telugu Global
Telangana

లంచాలు మింగుతూ '' బుల్లెట్టు బండి పెళ్లికొడుకు'' ఇలా దొరికిపోయాడు

లంచాలు మింగుతూ  బుల్లెట్టు బండి పెళ్లికొడుకు ఇలా దొరికిపోయాడు
X

''బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా'' అనే పాట అంతముందే వచ్చినా అది మరింత బాగా పాపులర్ అయింది మాత్రం గతేడాది ఒక పెళ్లికూతురు కారణంగానే. ఆమె భర్త ఇప్పుడు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. పరువు, వచ్చిన పేరు మొత్తం తీసేశాడు.

మంచిర్యాలకు చెందిన సాయి శ్రియతో 2021 ఆగస్టులో రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌ వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో సాయి శ్రియ.. బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేయడం బాగా వైరల్ అయింది.

ఆమె భర్త అశోక్ రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ అధికారిగా పనిచేస్తున్నారు. అల్మాస్‌గూడకు చెందిన దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అశోక్‌ 60వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు.

వారం క్రితం అశోక్‌కు నేరుగా 20వేల రూపాయలను దేవేందర్ రెడ్డి ఇచ్చారు. మరో 30వేలు ఇచ్చేందుకు వెళ్లగా డాక్యుమెంటరీ ప్లానర్ శ్రీనివాస్‌రాజుకు ఇవ్వాల్సిందిగా అశోక్ సూచించాడు. అప్పటికే ఏసీబీ అధికారులకు దేవేందర్ రెడ్డి సమాచారం అందించాడు. శ్రీనివాసరాజు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత బుల్లెట్టు బండి అశోక్‌ను, శ్రీనివాసరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌పై అప్పటికే పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నాగోల్‌లోని అతడి ఇంటిలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

First Published:  21 Sep 2022 3:02 AM GMT
Next Story