Telugu Global
Telangana

ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్.. ఎందుకంటే..?

ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ పిటిషన్‌ పై ఈరోజు విచారణ జరుగుతుంది.

ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్.. ఎందుకంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆల్రడీ అభ్యర్థులను ప్రకటించి సగం పని పూర్తి చేసిన బీఆర్ఎస్, ప్రచార పర్వంలో కూడా దూకుడు పెంచింది. ఎన్నికలనాటికి ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఉండేందుకు పావులు కదుపుతోంది. తాజాగా ఫ్రీ సింబల్స్ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ నేతలు.

కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కారును పోలిన రోడ్డు రోలర్‌ లాంటి గుర్తుల వల్ల బీఆర్‌ఎస్‌ కు ఎన్నికల్లో నష్టం కలుగుతుందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ పై ఈరోజు విచారణ జరుగుతుంది.

కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు ఇచ్చే ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని, అదే సమయంలో ఇతర ఏపార్టీలకు ఆ గుర్తులను కేటాయించొద్దని గతంలో కూడా పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఆ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డు రోలర్‌ గుర్తును ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించారు. అయితే ఇటీవల దాన్ని తిరిగి చేర్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశింది. కెమెరా, చపాతి రోలర్‌, రోడ్‌ రోలర్‌, సబ్బు పెట్టె, టీవీ సెట్, కుట్టుమిషన్‌, ఓడ, ఆటోరిక్షా, ట్రక్‌ వంటి గుర్తులు ఈవీఎంలలో కారు గుర్తును పోలి ఉంటున్నాయని, ఆ గుర్తులను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకూడదని బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల సంఘం స్పందించకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ.

First Published:  12 Oct 2023 4:34 AM GMT
Next Story