Telugu Global
Telangana

కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడ‌మే ప్రమాదం - కేటీఆర్‌

ప్రజల విశ్వాసాన్ని తక్కువ కాలంలోనే కోల్పోయే సహజ లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు కేటీఆర్. చరిత్రను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుందన్నారు.

కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండడ‌మే ప్రమాదం - కేటీఆర్‌
X

కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే డేండర్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశం సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజలకు మధ్యకు వస్తారని చెప్పారు. సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు చాలా పవర్‌ఫుల్ అన్నారు. ఖమ్మం వంటి ఒకటి, రెండు జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలే సాధించిందన్నారు. ఖమ్మంలో నేతల మధ్య ఆధిపత్య పోరే ఓటమికి కారణమన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలిచామని, మరో 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు కేటీఆర్‌. కొన్ని స్థానాలను వివిధ కారణాలతో కోల్పోయామని చెప్పారు. ఆ కారణాలపై సమీక్షించుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెల దాటిందని.. వచ్చిన తెల్లారి నుంచి హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.

ప్రజల విశ్వాసాన్ని తక్కువ కాలంలోనే కోల్పోయే సహజ లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు కేటీఆర్. చరిత్రను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుందన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరించి.. కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ, ఏడాదిన్నర తిరిగే లోపే కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందన్నారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజార్టీతో గెలిచిందన్నారు. చరిత్రను మరవకూడదన్నారు కేటీఆర్.

First Published:  9 Jan 2024 12:33 PM GMT
Next Story