Telugu Global
Telangana

ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ తీరుపై కేటీఆర్ సమీక్ష.. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సీఎం కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు తీరు, అందుకు సంబంధించిన సమాచారం, అభిప్రాయాలు అన్నీ ఈ కమిటీ ద్వారానే తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు.

ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ తీరుపై కేటీఆర్ సమీక్ష.. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
X

బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం వారీగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమ్మేళనాలలో ప్రతీ కార్యకర్త భాగస్వామ్యం అయ్యే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కేటీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపు నిచ్చారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మేళనాల నిర్వహణ, పార్టీ కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షించేందుకు మాజీ స్పీకర్ మధుసూదనా చారి నేతృత్వంలో 10 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు పరిశీలంచి. నివేదిక ఇస్తుందని కేటీఆర్ చెప్పారు.

సీఎం కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు తీరు, అందుకు సంబంధించిన సమాచారం, అభిప్రాయాలు అన్నీ ఈ కమిటీ ద్వారానే తీసుకుంటారని కేటీఆర్ తెలిపారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి అందరూ తప్పకుండా కమిటీకి జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రతీ శాసన సభ్యుడు తమ నియోజకవర్గంలో అత్యంత చురుకైన కార్యకర్తలతో కలిపి ఒక టీంను తయారు చేసుకోవాలని సూచించారు. ఆ టీం ఇటు పార్టీకి, అటు ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకే కాకుండా.. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు తప్పకుండా ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనాలని.. అందుకోసం ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ప్రతీ ఆత్మీయ సమ్మేళనం ప్రారంభంలో సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని తప్పకుండా చదివి వినిపించాలని కేటీఆర్ చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారానే పార్టీగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే అవకాశం ఉంటుందన్నారు.

ఆత్మీయ సమ్మేళనాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడే ప్రజా ప్రతినిధులను, వక్తలను ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే సమాచార సైనికులను తయారు చేసేందుకు ఈ సమ్మేళనాలు అద్బుతంగా ఉపయోగపడుతాయని కేటీఆర్ వెల్లడించారు.

ప్రతీ నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.

First Published:  2 April 2023 4:28 PM GMT
Next Story