Telugu Global
Telangana

గవర్నర్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం.. ఈరోజు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు కేటీఆర్. కాంగ్రెస్‌, బీజేపీకి ఉన్న ఫెవికాల్‌ బంధం మేరకు తెలంగాణ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు.

గవర్నర్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
X

తెలంగాణ గవర్నర్ కాంగ్రెస్ ఏజెంట్ గా మారిపోయారా..? తాజా పరిణామాలు చూస్తే అదే నిజమనిపించేలా ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ప్రతిపాదనలు వస్తే వాటిని బుట్టదాఖలు చేయడం గవర్నర్ కి అలవాటు. అయితే కాంగ్రెస్ ఇలా లిస్ట్ ఇచ్చిందో లేదో అలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు గవర్నర్ తమిళిసై. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బాధ్యురాలిగా పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజభవన్ కూడా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతో నడుస్తుందనే విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ బాధ్యత వహించాలని, కేవలం సీఎంకి మాత్రమే కాదని అన్నారు కేటీఆర్.

అప్పుడు రాంగ్.. ఇప్పుడు రైట్

తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్‌, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారని గుర్తు చేశారు కేటీఆర్. కానీ నేడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరామ్‌ ని ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్‌ తమిళిసై ఆగమేఘాల మీద స్పందించారని అన్నారు. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం.. ఈరోజు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఉన్న ఫెవికాల్‌ బంధం మేరకు తెలంగాణ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు కేటీఆర్. గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు కేటీఆర్.

సీఎం రేవంత్ రెడ్డికి చురకలు..

సీఎం రేవంత్ రెడ్డి అహంకార పూరిత వ్యాఖ్యలు, ఆయన చేష్టలు చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రాజకీయాల్లో కుసంస్కారం ఉన్న వ్యక్తులుంటే.. విమర్శలు కూడా అలాగే ఉంటాయన్నారు. ఒకే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించినా.. రేవంత్ రెడ్డి, అమిత్ షా మీటింగ్ తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా ప్రకటన వచ్చిందని.. అంటే కాంగ్రెస్ కి మేలు చేసేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందనే విషయం తేటతెల్లమైందని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తోందన్నారు.

First Published:  26 Jan 2024 12:25 PM GMT
Next Story