Telugu Global
Telangana

మోసం, దగా, వంచన..

పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనం వల్లే రైతన్నలకు లీగల్‌ నోటీసులు వెళ్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. దీనికి కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

మోసం, దగా, వంచన..
X

రైతు రుణాల రద్దు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్యాంకు అధికారులు అన్నదాతలకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన మోసం ఇదని అన్నారు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన ఎక్కడా చూడలేదన్నారు. రైతులు రుణాలు తిరిగి చెల్లించొద్దని ఎన్నికల ముందు ఘనంగా చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఈ లీగల్ నోటీసులకు ఏమని సమాధానం చెబుతారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు కేటీఆర్.


ఎన్నికల ముందు..

బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దని ఎన్నికలముందు రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాని కూడా రేవంత్ చెప్పారన్నారు. "ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు." అని కూడా రేవంత్ చెప్పారని అన్నారు. అప్పట్లో ఇన్ని మాటలు చెప్పిన రేవంత్.. ఇప్పుడు మాత్రం మౌనం వహించారని విమర్శించారు కేటీఆర్.

చెప్పినదొకటి, చేస్తున్నదొకటి..

పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనం వల్లే రైతన్నలకు లీగల్‌ నోటీసులు వెళ్తున్నాయని మండిపడ్డారు కేటీఆర్. దీనికి కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లకోసం రైతన్నలను మోసం చేశారని, వందరోజుల పాలన పూర్తయినా ఇంకా రుణమాఫీ చేయలేదన్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారని చెప్పారు కేటీఆర్.

First Published:  24 March 2024 5:41 PM GMT
Next Story