Telugu Global
Telangana

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైటింగ్ సీన్.. పీర్జాది గూడలో లాఠీచార్జ్

ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. ఇటీవల ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహన శ్రేణిపై కూడా ఇలాగే దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫైటింగ్ సీన్.. పీర్జాది గూడలో లాఠీచార్జ్
X

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏవీ ఇన్ఫో ప్రైడ్ అపార్ట్ మెంట్ లో మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఒక రూమ్ లో డబ్బులు దాచి ఉంచారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అంతే కాదు, ఆ అపార్ట్ మెంట్ ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వారి ఆరోపణలను తిప్పికొట్టారు. అపార్ట్ మెంట్ వద్ద ఇరు వర్గాలు కలబడ్డాయి. గొడవ ముదరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్ లో భారీగా డబ్బు నిల్వ చేశారని, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఎం.సుధీర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు. అక్కడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. మేయర్ నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు.

ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. ఇటీవల ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహన శ్రేణిపై కూడా ఇలాగే దాడి చేశారు కాంగ్రెస్ నాయకులు. ఆయన కారులో డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు పీర్జాదిగూడ వ్యవహారంలో కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు కాంగ్రెస్ నేతలు. ఓ వ్యూహం ప్రకారం కాంగ్రెస్ ఇలా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బు సంచులంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

First Published:  19 Nov 2023 4:38 PM GMT
Next Story