Telugu Global
Telangana

నాందేడ్ కు కేసీఆర్.. నేటినుంచి బీఆర్ఎస్ శిక్షణ తరగతులు

రెండు రోజుల శిక్షణ తర్వాత పార్టీ మెటీరియల్ ను నేతలకు అందజేస్తారు. నెలరోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదుకు కార్యక్రమం చేపడతారు.

నాందేడ్ కు కేసీఆర్.. నేటినుంచి బీఆర్ఎస్ శిక్షణ తరగతులు
X

తెలంగాణ వెలుపల తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ శిక్షణ తరగతులు మొదలవుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ శిక్షణా తరగతుల్ని సీఎం కేసీఆర్ ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. రెండురోజులపాటు జరిగే శిక్షణ తరగతుల్లో పార్టీ నియమావళి, విధి విధానాలను మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులకు వివరిస్తారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

నాందేడ్ ఎస్పీ శ్రీకృష్ణ కొకాటే బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యక్రమ ఏర్పాట్లను పూర్తి చేశారు. నాందేడ్ విమానాశ్రయం నుంచి శిక్షణ శిబిరం వరకు స్వాగత తోరణాలు భారీగా ఏర్పాటు చేశారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌, దేశ్‌ కీ నేత కైసే హో - కేసీఆర్‌ జైసే హో.. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ వంటి నినాదాలతో దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. పాస్ లు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు.

నియోజకవర్గ స్థాయిలో పార్టీ కన్వీనర్లు, సమన్వయకర్తలను ఇప్పటికే నియమించారు. వీరికి అదనంగా పార్టీలో మరిన్ని పదవులను ఈ శిక్షణ శిబిరం పూర్తయిన తర్వాత భర్తీ చేస్తారు. మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ కన్వీనర్లు, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్లు, రైతు విభాగం కన్వీనర్లు.. కచ్చితంగా ఈ శిక్షణలో పాల్గొనాలని ఆదేశాలందాయి. దీంతో వారంతా నాందేడ్ చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా నాందేడ్ కి వెళ్తారు.

రెండు రోజుల శిక్షణ తర్వాత పార్టీ మెటీరియల్ ను నేతలకు అందజేస్తారు. నెలరోజులపాటు పార్టీ సభ్యత్వ నమోదుకు కార్యక్రమం చేపడతారు. మహారాష్ట్రలో బలమైన పునాదులకోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికలనాటికి మరింత మంది గులాబీ కండువా కప్పుకుంటారని అంచనా. తెలంగాణ వెలుపల మహారాష్ట్రపైనే ఎక్కువగా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.

First Published:  19 May 2023 1:18 AM GMT
Next Story