Telugu Global
Telangana

మోదీ మేజిక్కు.. కట్టెల పొయ్యే దిక్కు

మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో మహిళలు మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని BRS నేతలు కౌంటర్లిచ్చారు.

మోదీ మేజిక్కు.. కట్టెల పొయ్యే దిక్కు
X

దేశ ప్రజలకు మళ్లీ మూలాలు గుర్తు చేసిన ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఊరూ వాడా వంటగ్యాస్ అందుబాటులోకి రావడంతో కొన్నాళ్లుగా అందరూ కట్టెల పొయ్యి వాడకాన్ని మానేశారు. కానీ ఇప్పుడు మోదీ బాదుడే బాదుడు ప్రోగ్రామ్ తో అందరికీ మళ్లీ కట్టెలపొయ్యే గుర్తొస్తోంది. గ్యాస్ సిలిండర్ల రేట్లు భరించలేక చాలామంది తిరిగి కట్టలపొయ్యివైపే మొగ్గు చూపుతున్నారు. దీన్ని సింబాలిక్ గా ఆవిష్కరించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ.. రోడ్లపై వంటావార్పు చేపట్టారు.


ముందుంది ముసళ్ల పండగ..

గ్యాస్ సిలిండర్ల రేటు పెంచడం ఇక్కడితో ఆగిపోలేదని, ముందుంది ముసళ్ల పండగ అంటున్నారు మంత్రి హరీష్ రావు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరోసారి గ్యాస్ రేటుని కేంద్రం పెంచుతుందన్నారాయన. పేద ప్రజలపై కేంద్రం గ్యాస్‌ బండ వేసిందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి దేశ ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి హరీష్‌ పిలుపునిచ్చారు.

పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాంనగర్ చౌరస్తాలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కట్టెల పొయ్యి మీద వంట చేసి వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. 2014లో 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1155 రూపాయలకు పెంచి ప్రజలపై కేంద్రం పెనుభారం మోపిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో మహిళలు మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని కౌంటర్లిచ్చారు.

First Published:  2 March 2023 11:18 AM GMT
Next Story