Telugu Global
Telangana

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి.. తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి కేటీఆర్

రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.

బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి.. తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి కేటీఆర్
X

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి ఇక అమ్ముకుందామని అనుకుంటున్న సమయంలో వడగండ్ల వానలు రైతులకు నష్టాన్ని మిగిలించాయి. అయితే, రైతులు ఎటు వంటి ఆందోళన చెందవద్దని.. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి. రైతులకు భరోసా ఇవ్వడానికి మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పర్యటించారు.

గోపాలపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఆరేసిన తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అని.. రైతుల కష్టాలు తెలిసిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జల వనరులు పెరగడానికి కారణం.. కేసీఆర్ సంకల్పమే అని తెలిపారు.

రాష్ట్రంలోని రైతులందరికీ సీఎం కేసీఆర్ అండగా ఉంటారు. 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రతీ ఎకరానికి రూ.10వేల నష్ట పరిహారం అందిస్తున్నామనన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందకుండా.. విశ్వాసంతో ఉండాలి. ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 7.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే రైతులకు డబ్బులు విడుదల అవుతాయని స్పష్టం చేశారు.

మోడీ కేవలం కర్ణాటకకే ప్రధానా?

నరేంద్ర మోడీ కేవలం కర్ణాటకకే ప్రధానా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేవలం కర్ణాటకకు మాత్రమే పాలు, సిలిండర్ ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వరా అని అన్నారు. ఒకప్పుడు ఉచితాలు వద్దు.. ఈ కల్చర్ మాది కాదు అన్న ప్రధానే.. ఇప్పుడు అదే కల్చర్ అవలంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. పిరమైన ప్రధాని, బీజేపీని ఓడించి ప్రజలు బుద్ది చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అదానీ కొన్న ఎయిర్‌పోర్టుకు జీఎస్టీ లేదు.. సామాన్యుడు కొనే పాలకు మాత్రం జీఎస్టీ ఉందని విమర్శించారు.


First Published:  2 May 2023 11:23 AM GMT
Next Story