Telugu Global
Telangana

నాది హామీ.. నిరుద్యోగులకు కేటీఆర్ భరోసా..!

దాదాపు రెండు గంటల పాటు వారితో చర్చించారు కేటీఆర్. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నియామక ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేస్తామన్నారు.

నాది హామీ.. నిరుద్యోగులకు కేటీఆర్ భరోసా..!
X

నోటిఫికేషన్ల విషయంలో అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓట్ల లెక్కింపు ముగిసిన మరుసటి రోజే.. అశోక్‌నగర్‌లో యువతతో సమావేశమై వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామన్నారు. అశోక్‌నగర్‌తో పాటు వర్సిటీలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న పలువురు ఉద్యోగార్థులు సోమవారం కేటీఆర్‌ను కలిశారు.

దాదాపు రెండు గంటల పాటు వారితో చర్చించారు కేటీఆర్. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నియామక ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేస్తామన్నారు. యువతకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా.. అంతకు మించే ఇచ్చామన్నారు కేటీఆర్. 2.3 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పటికే లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. గత పదేళ్లలో దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన మరో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు కేటీఆర్. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు.


ప్రభుత్వం పెద్దఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ.. నియామక ప్రక్రియలో సమస్యల కారణంగా నెలకొన్న ఆందోళనను కేటీఆర్‌కు వివరించామన్నారు ఉద్యోగార్థులు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య పెంచాలని కోరినట్లు చెప్పారు. గ్రూప్‌-2 పోస్టుల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారు కేటీఆర్. దాదాపు దశాబ్ధ కాలం పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం తనకు ఉందన్న కేటీఆర్‌.. ఈ విషయంలో యువతకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని తెలిపారు.

First Published:  21 Nov 2023 2:04 AM GMT
Next Story