Telugu Global
Telangana

పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంపై అబద్దాలు చెప్పిన బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.86 వేల కోట్లను కేంద్రమే ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంటులో ప్రకటించారు.

పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంపై అబద్దాలు చెప్పిన బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసు
X

తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతులకు సాగు నీటికి ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేశారు. అంతర్జాతీయ వేదికలపై కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం, దాని వల్ల కలిగిన ప్రయోజనంపై తెలంగాణ ప్రభుత్వం ఎలుగెత్తి చాటింది. అలాంటి ప్రాజెక్టుపై బీజేపీకి చెందిన ఎంపీ నిశికాంత్ దూబే అబద్దాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి స్పందన రాలేదు.

కాగా, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.86 వేల కోట్లను కేంద్రమే ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంటులో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలకు కేంద్రం నుంచి సహకారం ఉండటం లేదని. ఎవరు సహకరించకున్నా తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని.. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కూడా బుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో లేదా అని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

నామా నాగేశ్వరరావు చేసిన ప్రసంగానికి బీజేపీకి చెందిన జార్ఖండ్ ఎంపీ నిశికాంత్ దూబే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తి మాట్లాడారు. నామా నాగేశ్వరరావు ఆరోపణలు సరికాదని.. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.86 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపునే తాను ఈ విషయం చెబుతున్నానని అన్నారు. కేంద్ర మంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల తాను జోక్యం చేసుకొని వివరాలు వెల్లడిస్తున్నానని అన్నారు.

కాగా, నిశికాంత్ దూబే పార్లమెంట్ వేదికగా అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ వేదికగా కాళేశ్వరంపై తప్పుడు లెక్కలు, సమాచారం ఇచ్చినందుకు దూబేకు ప్రివిలేజ్ నోటీజు ఇచ్చారు. 2021 జూలై 22న లోక్‌సభలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించుకున్నారని చెప్పినట్లు బీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రమే కాకుండా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా కేంద్రం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని.. కాళేశ్వరం విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని కూడా స్పష్టం చేశారు. గతేడాది జూలై 31, డిసెంబర్ 15న మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో ఇదే సమాధానం చెప్పారని.. రాష్ట్ర ప్రభుత్వమే రుణాలను సమీకరించుకొని ప్రాజెక్టు నిర్మించుకున్నదని, ఆర్బీఐ నిబంధనలకు లోబడే ప్రాజెక్టు రుణాలను తీసుకున్నదని పార్లమెంటులో చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ ఎంపీలు గుర్తు చేస్తున్నారు.




First Published:  10 Aug 2023 11:13 AM GMT
Next Story